కొండ చిలువతో ఓ చిన్నారి బాలిక ఆడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ కొండ చిలువ బెడ్ పైకి వెళ్లుతుండగా.. ఆ బాలిక మాత్రం పాము తోకను పట్టుకుని వెనక్కి లాగుతూ కనిపించింది.
న్యూఢిల్లీ: పాములను చూసి ఎవరూ మురిసిపోరు. సరిసౄపం ఉన్నట్టు తెలిస్తే మైలు దూరం పరుగెత్తేవారే ఎక్కువ. విషపు పామైనా.. కోరలు లేని పామైనా అందరికీ భయమే. వడిగా పాకుతూ కదులుతుంటే వెన్నులో వణుకు పట్టడం ఖాయం. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం ఇందుకు విరుద్ధమైనదిగా కనిపిస్తున్నది. ఓ చిన్నారి బాలిక.. పెద్ద కొండ చిలువతో ఆటలాడుతున్న వైనం చాలా మందిని భయపెట్టింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేక్ మాస్టర్ ఎగ్జోటిక్స్ అనే అకౌంట్ ఈ వీడియో పోస్టు చేసింది. అందులో అరియానా అనే చిన్నారి బాలిక పెద్ద కొండ చిలువ తోకను పట్టుకుని వెనక్కి లాగుతూ కనిపించింది. కొండ చిలువ బెడ్ పైకి ఎక్కుతూ ఉండగా.. ఆమె ఆ పాము తోకను వెనక్కి పట్టి లాగుతూ కనిపించింది. కానీ, ఆ పాము వెనక్కి మళ్లలేదు. గోముగా ఆ పామును పట్టుకుని ఆడింది. కానీ, ఆ పాము మాత్రం ఆ పాప చేయి నుంచి తప్పించుకుని వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నది.
ఆమె బయో అకౌంట్ ప్రకారం, ఆ బాలిక పేరు అరియానా. ఆమె స్నేక్ లవర్ అని తెలుస్తున్నది. ఆమె ప్రొఫైల్‌లో ఎన్నో పాము వీడియోలు ఉన్నాయి. అందులో రకరకాల పాములతో ఆ పాప ఆడుకుంటూ కనిపించింది. ఆ పాము పడుకోవాలని అనుకుంటున్నదేమో అని క్యాప్షన్ రాసి ఉంది.
