ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్దమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. తమ వివాహాన్ని అంగీకరించాలని ఓ యువతుల జంట చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఉత్తరప్రదేశ్ : homosexual marriageకి హిందూ వివాహ చట్టం అడ్డు చెప్పనందున, ఆ చట్టం కింద తన వివాహాన్ని గుర్తించాలంటూ ఇద్దరు యువతులు చేసిన అభ్యర్థనను Allahabad High Court తిరస్కరించింది. ఈ తరహా వివాహం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకం అని... చట్టాల ప్రకారం చూసినా ఇది చెల్లదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాదనలు వినిపించింది. అంజూదేవి అనే మహిళ తన 23 సంవత్సరాల కూతురుని మరో 22 ఏళ్ళ యువతి అక్రమంగా నిర్బంధించిందని, తన కుమార్తెను అప్పగించాలంటూ Habeas Corpus plea వేసింది.
దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం... ఇద్దరు యువతులను తన ముందు ప్రవేశపెట్టాలని అంటూ ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మరుసటి రోజే వారిద్దరూ కోర్టు ముందు హాజరయ్యారు. తాము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని, తమ వైవాహిక బంధాన్ని గుర్తించాలని అభ్యర్థించారు. హిందూ వివాహ చట్టం ఇద్దరు వ్యక్తులు వివాహం గురించే ప్రస్తావిస్తున్నాయి తప్ప స్వలింగసంపర్కుల వివాహానికి అడ్డు చెప్పడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మాత్రం దీనికి అడ్డు చెప్పారు.
‘సంప్రదాయాలు, మతాలు, చట్టాల ప్రకారమే దేశం నడుస్తోంది. పవిత్ర భారతదేశంలో వివాహాన్ని సంస్కారంగా భావిస్తారు. అది స్త్రీ పురుషుల మధ్యే జరగాలి’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. యువతుల అభ్యర్థనను తిరస్కరించింది. యువతి తల్లి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ నూ కొట్టివేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలను కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. పెళ్లి అనేది కేవలం మనుషుల మధ్య బంధం మాత్రమే కాదని, స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే జీవ సంబంధ వ్యవస్థ అని గతంలో విస్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయపరమైన జోక్యం.. వ్యక్తిగత చట్టాల సున్నితమైన సమతుల్యం విధ్వంసం చేస్తుందని అభిప్రాయపడింది.
భార్య వివాహేతర కార్యకలాపాలు.. భరణం పొందకుండా అడ్డుకోలేవు.. ఢిల్లీ హైకోర్టు…
భార్య సాగించే క్రూరత్వ చర్యలు, అప్పుడప్పుడు ఏకాంతంలో చేసే వివాహేతర లైంగిక కార్యకలాపాలు భర్త నుంచి భరణం పొందకుండా ఆమెను అడ్డుకోజాలవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దిగువ కోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ చంద్రధరి సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ కేసులో విచారణ సందర్భంగా న్యాయ స్థానం.. భార్యకు 2020 ఆగస్టు నుంచి ప్రతి నెలా రూ.15 వేల చొప్పున భరణం చెల్లించాలని తీర్పు చెప్పింది.
భర్త దీనిని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య క్రూరత్వానికి, వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతోందని, తన నుంచి ఆమె దూరంగా ఉంటుందని.. అలాంటప్పుడు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. అయితే, ఈ కారణాలను హైకోర్టు తోసిపుచ్చింది. సమర్థుడైన వ్యక్తి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు పేదరికంలోకి జారిపోకుండా చూడటమే మెయింటినెన్స్ చట్ట లక్ష్యమని పేర్కొంది. భార్య పదేపదే వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతూ, దాన్ని కొనసాగించే సందర్భంలో మాత్రమే భరణం చెల్లించకుండా భర్తకు న్యాయపరమైన మినహాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది.
భార్య క్రూరత్వం కారణంగా విడాకులు మంజూరు చేసిన సందర్భాల్లో కూడా న్యాయస్థానాలు భరణం ఇప్పించిన విషయాన్ని గుర్తు చేసింది. భార్య వ్యభిచారం చేస్తున్నట్లు ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో నిరూపించాల్సి ఉంటుందనీ, అప్పుడప్పుడు ఒంటరిగా వివాహేతర లైంగిక కార్యకలాపాలకు పాల్పడితే.. అది పూర్తిగా వ్యభిచారంలో జీవిస్తున్నట్లు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో భర్త దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
