గంగా జమునా స్కూల్ వివాదం : మేము ఇష్ట ప్రకారమే ముస్లిం మతంలోకి వచ్చాం.. స్పష్టతనిచ్చిన మహిళా టీచర్లు
తాము ఇష్టపూర్వకంగానే ముస్లిం వ్యక్తులను పెళ్లి చేసుకున్నామని, ఇందులో ఎవరి ప్రమేయమూ లేదని మధ్యప్రదేశ్ లో ఇండోర్ గంగా జమునా స్కూల్ లో పని చేస్తున్న మహిళా టీచర్లు క్లారిటీ ఇచ్చారు. తమ మతమార్పిడికి, స్కూల్ కు ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు.
మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో జరిగిన మతమార్పిడి రాకెట్ తో ముడిపడి ఉన్న గంగా జమునా స్కూల్ వివాదానికి సంబంధించిన వివాదంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు మహిళా ‘హిందూ’ టీచర్లను ప్రలోభాలకు గురిచేసి ఇస్లాం మతంలోకి మార్చారని, వారు ముస్లిం పురుషులను వివాహం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై స్పష్టతను ఇచ్చేందుకు ఆ టీచర్లు ముందుకు వచ్చారు. గంగా జమున స్కూల్ లో టీచర్లుగా పనిచేస్తున్న ముగ్గురు మధ్య వయస్కులైన మహిళలు తమ మతమార్పిడి, ముస్లిం పురుషులతో జరిగిన వివాహంపై ‘టైమ్స్ నౌ’తో మాట్లాడారు.
హిందూ బాలికను తప్పుడు పేరుతో మోసం చేసి ప్రేమ.. రెండుసార్లు అబార్షన్.. ముస్లిం యువకుడు అరెస్ట్..
తమ పేర్లను మీడియాలో ప్రస్తావించడంపై ఆ మహిళా టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు టీచర్లు అనితా యదువంశీ (ఇప్పుడు అనితా ఖాన్), ప్రీతి శ్రీవాస్తవ (ఇప్పుడు అఫ్షా షేక్), ప్రాచీ జైన్ గా ఈ స్కూల్ ప్రారంభించకముందే తాము ఇస్లాం మతంలోకి మారామని చెప్పారు. ఆ సమయంలో ముస్లిం యువకులను పెళ్లి చేసుకున్నామని స్పష్టతనిచ్చారు. తమ మత మార్పిడికి, స్కూల్ కు ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు.
ఈ వివాదంలో మీడియాలో ప్రముఖంగా పేరు ప్రస్తావనకు వచ్చిన అనితా ఖాన్ మీడియాతో మాట్లాడుతూ..గతంలో తన పేరు అనితా యదువంశీ అని ఇప్పుడు అనితా ఖాన్ అని చెప్పారు. తాను 2013 లో వివాహం చేసుకున్నానని, 2021 లో పాఠశాలలో చేరానని తెలిపారు. ఈ మతమార్పిడిలో హాజీ మహ్మద్ ఇద్రీస్ పాత్ర లేదని, ఇందులోకి అనవసరంగా ఆయనను లాగుతున్నారని ఆరోపించారు. హాజీ తనను మతం మార్చాడని, తాను ఈ విషయం చైల్డ్ డెవలప్ మెంట్ కమిటీకి చెప్పానని ఓ పత్రిక రాసిందని చెప్పారు. కానీ తాను ఏ కమిటీకి స్టేట్ మెంట్ ఇవ్వలేదని, అదంతా అబద్ధమని అన్నారు. ఇందులోకి తన పేరు ఎందుకు లాగుతున్నారని ఆమె ప్రశ్నించారు.
మరో మహిళా టీచర్ ప్రాచీ జైన్ మాట్లాడుతూ.. తాను 2004 జనవరి 27వ తేదీన ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టానుసారం పెళ్లి చేసుకున్నానని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో మీడియా అనవసరంగా పాఠశాల పేరును వాడుకుంటోందని, హాజీ కు ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. ఆయన 2004లో తన పెళ్లి చేసి 2012లో పాఠశాలను ప్రారంభించారన్నారు. ఆ తర్వాత తాను స్కూల్ లో చేరానని తెలిపారు. నేను నా సొంత కోరికతో వివాహం చేసుకున్నానని, తనకు ఇప్పుడు ఇద్దరు టీనేజ్ వయస్సున్న పిల్లలు ఉన్నారని చెప్పారు.
ఇంకో మహిళా టీచర్ అఫ్షా షేక్ మాట్లాడుతూ.. ఈ మతమార్పిడి ఆరోపణలన్నీ నిరాధారమైనవి, ఎందుకంటే పాఠశాల 2010 లో మొదలుపెట్టారని అన్నారు. తాను 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నానని తెలిపారు. తనకు 21 ఏళ్ల కూతురు ఉందని తెలిపారు. వీటన్నింటితో పాఠశాలకు ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. తాను మేజర్ అయ్యాక తన ఇష్టప్రకారమే వివాహం జరిగిందని, ఇష్టానుసారం మతం మార్చుకునే హక్కును రాజ్యాంగం తనకు కల్పించిందని అన్నారు.
అప్రమత్తమైన లోకో పైలెట్.. తప్పిన భారీ రైలు ప్రమాదం..
గంగా జమున స్కూల్ లో టీచర్లను కూడా బలవంతంగా మతం మారుస్తున్నారని ఆరోపణలు రావడంతో దీనిపై స్పష్టతను ఇవ్వడానికి ముగ్గురు మహిళా టీచర్లు కలెక్టరేట్ కు వచ్చారు. బోర్డు ఎగ్జామ్ టాపర్లలో కొందరు హిజాబ్ ధరించి ఉన్న బాలికల పోస్టర్ స్కూల్ గోడకు అతికించడంతో ఈ వివాదం మొదలైంది. ఆ పోస్టర్లలో హిందూ బాలికలు ఉన్నారని, వారితో స్కూల్ యాజమాన్యం బలవంతంగా హిజాబ్ ధరించేలా చేసిందని వీహెచ్ పీ, ఏబీవీపీ తో పాటు పలు మితవాద సంస్థలు ఆరోపించాయి.