బెంగళూరు అలయన్స్ వర్శిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ డాక్టర్ అయ్యప్ప దొరె(53)ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఆర్టీనగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయపుర జిల్లాకు చెందిన డాక్టర్ అయ్యప్ప దొరె ఆర్టీ నగరలో 17ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అనేకల్ సమీపంలోని అలయన్స్ వర్శిటీ లో ఎనిమిదేళ్లపాటు వైస్ ఛాన్సలర్ గా పనిచేసి ఇటీవల రిటైర్ అయ్యారు.

కాగా... ఆయన మంగళవారం రాత్రి 10గంటల సమయంలో భోజనం చేసి వాకింగ్ కి బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటికి 50మీటర్ల దూరంలో ఆయనపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలపాలై ఆయన కన్నుమూశారు. 

వాకింగ్ అని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. వెంటనే ఆయన భార్య భావన, ఇతర కుటుంబసభ్యులు ఆయన కోసం గాలించగా... రక్తపు మడుగులో పడి కనిపించారు. హుటా హుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయారని చెప్పారు.  కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నిందితుల ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పారు. అయ్యప్పదొరె ఇటీవల రాజకీయ పార్టీని స్థాపించారు. గత ఎన్నికల్లో ముద్దేబీహళ నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేశారు. అంతేకాకుండా భూ వివాదానికి సంబంధించి అలయన్స్ వర్శిటీపై ఆయన కోర్టులో కేసు కూడా వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. 

కాగా లింగాయత్‌లకులకు ప్రత్యేక ధర్మం కావాలని అయ్యప్ప పోరాటం చేశారు. అదే విధంగా శివరామ కారంత డినోటీపీకేషన్‌ కేసుకు సంబంధించి గతంలో సీఎంగా యడియూరప్ప ఉన్నప్పడు అయనపై ఏసీబీకీ ఫిర్యాదు చేశారు. ఇవేకాకుండా అనేక అంశాలపై కూడా అయన పోరాటం చేశారు. ఇక డీసీపీ శశికుమార్‌... అయప్పదొరె భార్య భవన నుంచి కొంత సమాచారం సేకరించారు. భూ వివాదానికి సంబంధించి కోర్టులో నడుస్తున్న కేసు వివరాలు తెలుసుకున్నారు. ఇలా అన్ని కోణాల్లో పోలీసులు అయ్యప్ప హత్య కేసును విచారిస్తున్నారు.