లోక్‌సభ ఎన్నికలను నిర్వహించిన తీరు పట్ల కేంద్ర ఎన్నికల సంఘం విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటోంది. బీజేపీకి కొమ్ము కాస్తోందని.. కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

అయితే కాంగ్రెస్ కురు వృద్ధుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం ఈసీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న దాదా ఎన్నికల కమీషన్ పనితీరుతో పాటు పలు సంస్కరణలపై ప్రసంగించారు.

దేశంలోని వ్యవస్థలన్నింటినీ మరింత బలోపేతం చేయాలంటే అవన్నీ సక్రమంగా పనిచేసే అవకాశం కల్పించాలని ప్రణబ్ సూచించారు. మనదేశంలో ప్రజాస్వామ్యం విలసిల్లుతోందంటే సుకుమార్ సేన్ నుంచి ఇప్పటి వరకు పనిచేసిన ఎన్నికల కమీషనర్లే కారణమన్నారు.  

వారి పనితీరును మనం విమర్శించలేమని.. ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగిందని ఈసీని ప్రశంసించారు. దశాబ్ధాల కృషితో నిర్మించుకున్న వ్యవస్థలు, సంస్ధలు సక్రమంగానే పనిచేస్తున్నాయని.. వాటిని వినియోగించుకోవడంలోనే మన సమర్థత దాగి వుందని ప్రణబ్ అభిప్రాయపడ్డారు.

తాజా ఎన్నికల్లో ప్రజలు రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల ప్రణబ్ ముఖర్జీ హర్షం వ్యక్తం చేశారు.