హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్నర్ బుధవారం మరోసారి అరెస్ట్ అయ్యారు. మహిళా న్యాయమూర్తులు, న్యాయమూర్తుల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చెన్నై పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.

యూట్యూబ్ వేదికగా మహిళా న్యాయమూర్తులు, న్యాయమూర్తుల భార్యలపై ఆయన అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు. వీటి ఆధారంగానే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు చెన్నై పోలీసులు పేర్కొన్నారు. 

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల భార్యలపై ఆయన అప్రియంగా పరువు నష్టం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మాజీ న్యాయమూర్తి కర్ణన్‌పై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

అయితే కర్ణన్ అరెస్టవ్వడం ఇది తొలిసారేం కాదు కలకత్తా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై గతేడాది మే 9న జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. 

దీంతో పశ్చిమబెంగాల్ నుంచి పరారైన కర్ణన్‌ను జూన్ 20న కోయంబత్తూరులో సీఐడీ అరెస్ట్ చేసింది. పరారీలో ఉండగా రిటైరైన తొలి హైకోర్టు జడ్జిగా కూడా కర్ణన్ రికార్డులకెక్కారు. మద్రాస్ హైకోర్టు జడ్జిగానూ కర్ణన్ పనిచేశారు.