సిక్కింలో ఆకస్మిక వరదలు.. 14 మంది మృతి, 102 మంది గల్లంతు..
సిక్కింలో ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. ఈ వరద వల్ల ఏర్పడిన ప్రమాదాల్లో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. మరో 102 మంది గల్లంతు కాగా.. వీరిలో 22 మంది సైనికులు ఉన్నారు.
సిక్కింలో బుధవారం తెల్లవారుజామున ఆకస్మిక వరదలు సంభవించాయి. వీటి వల్ల సంభవించిన ప్రమాదాల్లో 14 మంది మృతి చెందారు. మరో 102 మంది గల్లంతయ్యారు. ఇందులో 22 మంది సైనికులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 26 మంది గాయపడగా, 2,000 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారని ‘ఎన్డీటీవీ’ కథనం పేర్కొంది. ఈ వరదల వల్ల 11 వంతెనలు కొట్టుకుపోయాయని, 22,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని నివేదించింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో పలు ఏజెన్సీలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. భారత వైమానిక దళం కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. కాగా.. ఈ వరదల వల్ల హిమాలయాల దిగువన ఉన్న తూర్పు సిక్కింలోని పాక్యాంగ్ లో అత్యధికంగా ఏడు మరణాలు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 59 మంది గల్లంతయ్యారు. వీరిలో 23 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. కాగా.. ఫేమస్ హాలిడే డెస్టినేషన్ అయిన ఈ సిక్కిం రాష్ట్రంలోని ఆకస్మిక వరదల వల్ల వివిధ ప్రాంతాల్లో 3,000 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు.
వాయువ్య సిక్కింలోని లోనాక్ సరస్సుపై మేఘావృతమై నీటి మట్టాలు పెరిగాయని సిక్కిం చీఫ్ సెక్రటరీ వీబీ పాఠక్ తెలిపారు. ఈ సరస్సు ఉప్పొంగి సిక్కిం, పశ్చిమబెంగాల్ మీదుగా ప్రవహించే తీస్తా నదిలోకి ప్రవహించి బంగ్లాదేశ్ లోకి ప్రవేశించింది. తీస్తా బేసిన్ లోని వివిధ ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగిందని, ముఖ్యంగా తీస్తా స్టేజ్ 3 డ్యామ్ పగిలిన చుంగ్తాంగ్ లో ప్రమాదకర స్థాయిలు నమోదయ్యాయని తెలిపారు.
కాగా.. ఈ వరదల వల్ల రోడ్లు కొట్టుకుపోవడం, వంతెనలు దెబ్బతినడంతో ఆహార సరఫరాకు కొరత ఏర్పడిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభావిత ప్రాంతాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడానికి సైన్యం బెయిలీ వంతెనలను (పోర్టబుల్, ప్రీఫాబ్రికేటెడ్ వంతెనలు) అసెంబుల్ చేస్తోంది.