ఓ వైపు హత్రాస్ బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుండగానే కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో 17 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి బగ్బెరా ప్రాంతంలో బాలిక తన ప్రియుడితో కలిసి వస్తోంది. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఐదుగురు యువకులు ఈ జంటను అడ్డుకున్నారు.

వారిని బలవంతంగా కాల్‌యాదిహ్ గౌషాలా వద్దకు లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆమె ప్రియుడుని చెట్టుకు కట్టేసి బాలిక తలపై తుపాకీ గురి పెట్టి చంపేస్తామని బెదిరించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తనపై జరిగిన దారుణంపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురు నిందితులను అరెస్టు చేసారు. నిందితులను శంకర్ తియు, రోషన్ కుజుర్, సూరజ్ పాత్రో, సన్నీ సొరెన్‌గా గుర్తించారు.

వీరిలో ఒకరు మైనర్ కావడంతో అతడిని బాల నేరస్థుల కారాగారానికి తరలించారు. నిందితుల వద్ద నుంచి దేశీయ పిస్టల్‌, రెండు లైవ్‌ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.