మహా కుంభమేళా స్థలంలో పుట్టిన మొదటి ఆడబిడ్డ ... పేరేంటో తెలుసా?
మహాకుంభ్ సెంట్రల్ హాస్పిటల్‌లో ఒక మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మహాకుంభ్ హాస్పిటల్‌లో పుట్టిన మొదటి ఆడ బిడ్డ ఈమె... ఈ బిడ్డకు 'గంగా' అని పేరు పెట్టారు.
ప్రయాగరాజ్ : మహా కుంభమేళా అధికారికంగా ప్రారంభం కాకముందే భక్తుల సౌకర్యార్థం కుంభనగరిలో ఏర్పాటుచేసిన సెంట్రల్ హాస్పిటల్ సేవలు అందిస్తోంది. ఇవాళ (సోమవారం) ఈ హాస్పిటల్‌లో ఒక మహిళ ప్రసవం జరిగింది... పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. కుంభమేళా కోసం ఏర్పాటుచేసిన హాస్పిటల్‌లో పుట్టిన మొదటి ఆడ శిశువు ఈమే. అందుకే హాస్పిటల్ సిబ్బంది ఆ శిశువు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమెకు 'గంగా' అని పేరు పెట్టారు.
డాక్టర్ గౌరవ్ దూబే నేతృత్వంలోని వైద్య బృందం ఈ ప్రసవం విజయవంతంగా నిర్వహించింది. ఇంతకు ముందు ఆదివారం డాక్టర్ దూబే బృందం మహా కుంభమేళాలో మొదటి బాబు ప్రసవం చేసింది. ఆ బాబుకు 'కుంభ్' అని పేరు పెట్టారు.
బాందా నుండి వచ్చిన మహిళ
మహాకుంభ్ నగర్ సెంట్రల్ హాస్పిటల్ నోడల్ వైద్య అధికారి డాక్టర్ గౌరవ్ దూబే మాట్లాడుతూ... సెంట్రల్ హాస్పిటల్‌లో సోమవారం మొదటి ఆడ శిశువు జన్మించిందని తెలిపారు. డాక్టర్ గౌరవ్, డాక్టర్ ప్రమీల, డాక్టర్ పోన్షిల బృందం మధ్యాహ్నం 12:08 గంటలకు ఈ ప్రసవం విజయవంతంగా నిర్వహించింది. బాందా జిల్లాకు చెందిన శివకుమారి, రాజేల్ దంపతులు మహాకుంభ్‌లో పుట్టిన ఈ ఆడ శిశువును గంగా మాత ఆశీర్వాదంగా భావిస్తున్నారు. అందుకే ఆమెకు 'గంగా' అని పేరు పెట్టారు.
డాక్టర్ గౌరవ్ దూబే మాట్లాడుతూ... శిశువు బరువు 2.8 కిలోలు వుందన్నారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, హాస్పిటల్‌లో వారికి మంచి సంరక్షణ అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇంతకు ముందు ఆదివారం సాయంత్రం హాస్పిటల్‌లో ఒక బాబు జన్మించాడు... అదే మహాకుంభ్‌లో మొదటి ప్రసవం అని తెలిపారు.
ఆదివారం మొదటి ప్రసవం
ఆదివారం కౌశాంబికి చెందిన 20 ఏళ్ల సోనమ్ అనే మహిళకు ఒక బాబు పుట్టాడని డాక్టర్ గౌరవ్ తెలిపారు. సెంట్రల్ హాస్పిటల్‌లో డాక్టర్ గౌరవ్ నేతృత్వంలో డాక్టర్ నూపూర్, డాక్టర్ వర్తిక ఈ ప్రసవం నిర్వహించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
ఆదివారం 20 ఏళ్ల సోనమ్ తన భర్త రాజాతో కలిసి ఇక్కడికి వచ్చింది. ఈ కుటుంబం మహాకుంభ్ మేళా ప్రాంతంలో పని కోసం వచ్చింది. సోనమ్‌ను హాస్పిటల్‌కు తీసుకువచ్చే సమయానికి ఆమెకు తీవ్రమైన ప్రసవ వేదన ఉంది. మహిళా వైద్యులు ఆమెను పరీక్షించి, ఆమెను హాస్పిటల్‌లో చేర్చుకున్నారు.
సెంట్రల్ హాస్పిటల్‌లో లేబర్ రూమ్ నుండి ఐసీయూ వరకు అన్ని సౌకర్యాలు
మహాకుంభ్‌కు కోట్ల మంది ప్రజలు వస్తారని భావిస్తున్నందున యోగి ప్రభుత్వం ఇక్కడ ఆరోగ్య సౌకర్యాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మేళా ప్రాంతంలోని పరేడ్ వద్ద 100 పడకల సెంట్రల్ హాస్పిటల్ నిర్మించింది...ఇది చాలా రోజులుగా పనిచేస్తోంది. మహాకుంభ్ సెంట్రల్ హాస్పిటల్‌లో ఓపీడీ, జనరల్ వార్డు, ప్రసవ కేంద్రం, ఐసీయూ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు హాస్పిటల్ రెండు ప్రసవాలు విజయవంతంగా నిర్వహించింది.