తమిళనాడులోని మధురైలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విలక్కుతున్‌ సమీపంలో ఉన్న నవబత్కన వీధిలోని టెక్స్‌టైల్స్‌ దుకాణంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి.  

ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే...శుక్రవారం రాత్రి 11 గంటలకు దుకాణం ముసివేయగా.. సుమారు శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది.

భవనంలోని మొదటి అంతస్తులో ముందుగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ దుకాణం ఓ పాత బిల్డింగ్‌లో నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వివిధ ప్రాంతాల నుంచి నాలుగు ఫైర్‌ ఇంజన్లను సంఘటన స్థలానికి పంపించాయి.

మంటలను అదుపులోకి తీసుకు వచ్చే క్రమంలో బిల్డింగ్‌‌ కూలి ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది (క్రిష్ణమూర్తి, శివరాజన్‌) గాయాలపాలయ్యారు. వీరు పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయారు.

ఇది గమనించిన తోటి సిబ్బంది ఇద్దరిని వెలికి తీసి వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కృష్ణమూర్తి, శివరాజన్‌ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీరితోపాటు మరో ఇద్దరు సిబ్బందికి చిన్న చిన్న గాయాలయ్యాయి.

కాగా మధురై జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ కే కళ్యాణా కుమార్‌, పోలీసులు, మున్సిపల్‌ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి సరైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.