ఝార్ఖండ్: రాతి యుగంలోనే కాదు ఈ రాకెట్ యుగంలోనూ ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతోంది. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలపై వివక్ష ఏ స్థాయిలో వుందో తెలియజేసే దారుణ సంఘటన ఝార్ఖండ్ లో చోటుచేసుకుంది. మగ బిడ్డ కోసం మూడ నమ్మకాలతో ఏకంగా కన్న కూతురినే బలిచ్చాడో కసాయి తండ్రి. 

వివరాల్లోకి వెళితే... ఝూర్ఖండ్ రాజధాని రాంచీలో సుమన్ నగాసియా(26)అనే దినసరి కూలీ భార్యా, కూతురితో కలిసి నివాసముంటున్నాడు. అయితే అతడికి మగ బిడ్డ కావాలనే కోరిక వుండేది. కానీ భార్య మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనివ్వడంతో అతడు నిరాశకు గురయ్యాడు. దీంతో రెండో సంతానంగా మగబిడ్డను పొందాలని ఓ మాంత్రికుడిని ఆశ్రయించాడు సుమన్. 

అయితే మగ బిడ్డను పొందాలంటే కూతురుని బలివ్వాలని మాంత్రికుడు సూచించాడు. అతడి మాటలను నమ్మి అత్యంత కర్కకంగా వ్యవహరించాడు సుమన్. ఆరేళ్ల కన్న కూతురు తలను నరికి దారుణంగా హత్య చేశాడు. 

ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ఈ దారుణానికి పాల్పడిన బాలిక తండ్రిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.