ప్రముఖ కూచిపూడి కళాకారిణి శోభానాయుడు కన్నుమూశారు. ఆమె కరోనా బారినపడటంతో గత కొన్ని రోజులకుగా హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆమె వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 58 సంవత్సరాలు.

ఆమె మృతికి పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె గత కొంతకాలంగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టుగా ఆమె భర్త మాజీ ఐఏఎస్ అధికారి అర్జున్ రావు వెల్లడించారు. 

వెంపటి చినసత్యం శిష్యురాలిగా ఆమె పలు ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు. ఆమె కూచిపూడి డాన్స్ అకాడెమీని ఏర్పాటుకి చేసి పలువురికి శిక్షణ అందించారు. దేశ విదేశాల్లో ఆమె శిష్యులు ఉన్నారు. 

ఆమె ఏర్పాటు చేసిన కూచిపూడి స్కూల్ 40 సంవత్సరాలుగా వివిధ దేశాలకు చెందిన ఎందరో కళాకారులను తయారుచేసింది. తన ట్రూప్ తో దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి కళకు జీవం పోసింది. 

1956 లో అనకాపల్లి లో సాంప్రదాయకమైన కుటుంబంలో జన్మించింది. కుటుంబ కట్టుబాట్లను ఎదురించిమరీ తల్లి కూచిపూడిలో శిక్షణ ఇప్పించింది. ఆ తరువాత ఆమె వెంపటి చినసత్యం దగ్గర శిష్యురాలిగా చేరారు. 

12 సంవత్సరాల కర సాధన ఆమెను ఉన్నత శిఖరంపై నిలబెట్టింది. వెంపటి చినసత్యం శిష్యుల్లో అగ్రామిగా నిలిచిన శోభా నాయుడు అనేక నృత్య రూపకాల్లో దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. కూచిపూడికి గత వైభవాన్ని తీసుకొచ్చేనందుకు డాన్స్ అకాడెమీని ఏర్పాటు చేసింది. 

పద్మావతి, సత్యభామ, చండాలిక పాత్రల్లో శోభానాయుడు నృత్య రూపకాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఆమెకు ఈ పాత్రలు అత్యంత పేరును తీసుకొచ్చిపెట్టాయి. దేశవిదేశాల్లో ఈమెకు దాదాపుగా 1500 మంది శిష్యులు ఉన్నారు. భారత ప్రభుత్వం ఈమెను 2001లో పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది.