తమిళనాడులోని మథురలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. దర్యాప్తు సరిగా జరపడం లేదని, అసలైన నిందితులను అరెస్ట్‌ చేయలేదని బాధిత కుంటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... నవంబర్‌ 26న కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన ఓ ఎనిమిదేళ్ల బాలిక అదృశ్యం అయింది. ఎంత సమయమవుతున్నా తమ బిడ్డ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు.

దీంతో వారు అడవితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా బాలిక ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆ తర్వాతి రోజు ఆ బాలిక అడివిలో శవమై కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక మానసిక వికలాంగుడిని ఈ కేసులో అరెస్ట్​ చేసి అసలు నిందితులను పోలీసులు వదిలేశారని బాలిక కుటుంబం ఆరోపిస్తోంది.

పోలీసుల తీరును తప్పుబడుతూ బుధవారం బాలిక తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అసలు నిందితులు బయటే తిరుగుతున్నారని వారు ఆరోపించారు. వారిని అరెస్ట్​ చేసి లోతుగా దర్యాప్తు చేయాలని బాలిక తండ్రి డిమాండ్‌ చేస్తున్నాడు.

అలాగే ప్రస్తుతం కస్టడీలో వున్న మానసిక వికలాంగుడిని పోలీసులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తులో భాగంగానే ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశామని పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత లోతుగా విచారిస్తామని పేర్కొన్నారు.