బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది.. భర్త మరణంతో మానసిక క్షోభకు గురైన భార్య తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మైసూరు నగరంలోని పీఎస్ నగరకు చెందిన కిషన్ వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఆయనకు భార్య కవితా మందణ్ణ, కుమారుడు కౌశిక్, కుమార్తె కల్పిత ఉన్నారు. అయితే నాలుగు నెలల క్రితం ఆయన ఉన్నట్లుండి అదృశ్యమయ్యారు. భర్త ఆచూకీ కోసం ఆమె ఎంతగానో ప్రయత్నించారు.

ఈ క్రమంలో కిషన్ చనిపోయారని శనివారం మధ్యాహ్నం సమాచారం అందింది. భర్త మరణవార్తను తట్టుకోలేకపోయిన ఆయన భార్యాపిల్లలు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కుటుంబసభ్యులంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి బంధువుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. తర్వాత కారులో దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ సమీపంలోని పెనెమంగళూరు వద్దకు చేరుకున్నారు.

అనంతరం నేత్రావతి నది వంతెన వద్ద కారును నిలిపి ముందుగా పెంపుడు కుక్కను నీటిలోకి తోసివేశారు. అనంతరం కవిత ఆమె పిల్లలు ముగ్గురూ ఒకేసారి నదిలోకి దూకేశారు. దీనిని గమనించిన స్థానికులు కవితను నీటిలోంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

కౌశిక్, కల్పితల ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. వాట్సాప్‌లో కిషన్ కుటుంబం రాసిన లేఖను చూసిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బంట్వాళలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకుని కల్పిత, కౌశిక్‌ల కోసం నేత్రావతిలో గాలిస్తున్నారు.