Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

కేంద్రమాజీమంత్రి పి.చిదంబరం అరెస్ట్ సస్పెన్షన్ ఎట్టకేలకు వీడింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. 

ex union minister chidambaram arrest at new delhi over inx media case
Author
New Delhi, First Published Aug 21, 2019, 9:52 PM IST

న్యూఢిల్లీ: కేంద్రమాజీమంత్రి పి.చిదంబరం అరెస్ట్ సస్పెన్షన్ ఎట్టకేలకు వీడింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. చిదంబరంను ఆయన ఇంటి నుంచి నేరుగా సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. సీబీఐ హెడ్ క్వార్టర్ లో చిదంబరం ను ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారించే అవకాశం ఉంది.  

ఇకపోతే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పి.చిదంబరం. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ, సీబీఐ అధికారులు చిదంబరంను అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. 

హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ పిటీషన్ ను రద్దు చేసింది. హైకోర్టు బెయిల్ పిటీషన్ రద్దు చేయడంతో చిదంబరం ఇంటికి చేరుకున్నారు సీబీఐ, ఈడీ అధికారులు. అయితే అప్పటికే చిదంబంర అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

బుధవారం తన న్యాయవాదులతో సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే కేసు విచారణను శుక్రవారం స్వీకరించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లి 24 గంటలు కావడంతో ఢిల్లీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.  

చిదంబరం ఇంటికి నోటీసులు అంటించారు. గంటలో విచారణకు హాజరుకావాల్సి ఉందని నోటీసులో పేర్కొన్నారు. లేని పక్షంలో అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తన కుటుంబం పాత్ర ఏమీ లేదని తెలిపారు. గత ఏడు నెలలుగా తమ కుటుంబం టార్గెట్ గా కుట్రలు జరుగుతన్నాయంటూ ఆరోపించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ, ఈడీ చార్జిషీట్ లలో తనపేరు గానీ, తన కుమారుడిపేరుగానీ లేదన్నారు. 

అయితే ప్రస్తుతం ఈడీ తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిపారు. ప్రస్తుతం తనకు జీవితమా, స్వేచ్ఛ అనే రెండింటిలో ఏది తేల్చుకోవాలో అన్న సందేహం నెలకొందన్నారు. అయితే తాను స్వేచ్ఛకే కట్టుబడి ఉంటానని, చట్టాలను గౌరవిస్తానని తెలిపారు. పరోక్షంగా అరెస్ట్ కు మెుగ్గు చూపారు. 

చిదంబరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నారన్న సమాచారంతో సీబీఐ, ఈడీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. సీబీఐ, ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు జారీ చేశారు. 

అనంతరం చిదంబరం తన నివాసానికి చేరుకున్నారు. తన నివాసంలో న్యాయవాదులతో సంప్రదింపులు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరం ఇంటికి చేరుకున్నారు. చిదంబరం ఇంటి గేటుకు తాళాలు వేయడంతో గేటు దూకి మరీ లోపలికి వెళ్లారు సీబీఐ, ఈడీ అధికారులు. 

అయితే చిదంబరంను అరెస్ట్ చేస్తే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, అరెస్ట్ ను అడ్డుకునే పరిస్థితి కూడా తలెత్తే ఛాన్స్ ఉందని తెలియడంతో ఢిల్లీ పోలీసుల సాయం కోరారు. దాంతో ఢిల్లీ పోలీస్ శాఖ 20 మంది పోలీసులను అప్పగించింది. 

20 మంది పోలీసుల సాయంతో సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. గంటపాటు నెలకొన్న ఉద్రికత్తకు తెరదించారు సీబీఐ అధికారులు. చిదంబరం ఇంటి నుంచి నేరుగా సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు సీబీఐ అధికారులు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios