తాము ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, తమ ఓటమిని అంగీకరిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రకటించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని .. ఓటర్లకు ధన్యవాదాలు’’ అంటూ కమల్‌నాథ్ ట్వీట్ చేశారు.

మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి హవా కొనసాగుతోంది. ఈరోజు ఓట్ల లెక్కింపు కాగా, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బిజెపి 20 స్థానాల్లో ముందంజలో ఉంది.

కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మొరెనా నియోజకవర్గంలో బీఎస్పీది పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ లో తమదే హవా కావడంతో మధ్యప్రదేశ్ బిజెపి శ్రేణులు సంబరాలు ప్రారంభించాయి. పార్టీ ప్రధాన కార్యాలయంలో మిఠాయిలు పంచుకుంటూ నేతలు, కార్యకర్తలు వేడుకలు షురూ చేశారు.

అయితే, మధ్యప్రదేశ్ బిజెపి సర్కారులోని ముగ్గురు మంత్రులు తమ ప్రత్యర్థులకన్నా వెనుకబడి ఉండడం గమనార్హం. సుమావోలి నియోజకవర్గంలో ఐదాల్ సింగ్ కన్సానా, దిమాని నియోజవకర్గంలో గిరిరాజ్ దండోత్, మెహగావ్ నియోజకవర్గంలో ఓపీఎస్ భదోరియా వెనుకంజలో ఉన్నారు.

అటు, కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వచ్చిన జ్యోతిరాదిత్య సింథియా ఆధిక్యంలో ఉన్నారు.  ఉప ఎన్నికల ఫలితాలపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మరోసారి అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పట్టం కట్టారని తెలిపారు.

మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని నిర్ణయించారని.. ఈ విషయం ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు.