హర్యానాలో జేజేపీ పార్టీకి మాజీ జవాన్, ఆ పార్టీనేత తేజ్ బహదూర్ షాకిచ్చాడు. పార్టీకి రాజీనామా చేసాడు. బీజేపీ పార్టీతోని కలవడం పూర్తిగా అనైతికమని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మీద జేజేపీ పార్టీ టిక్కెట్టుపైన పోటీ చేసి ఓటమి చెందాడు. గత ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ తరుపున ప్రధాని మోడీపై కాశీ నుండి పోటీ చేయాలనీ భావించి నామినేషన్ వేసాడు. కాకపోతే ధ్రువపత్రాలు సరిగాలేవని అతని నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. 

గతంలో బిఎస్ఎఫ్ జవాన్ గా పనిచేసిన తేజ్ బహదూర్ జవాన్లకు పాడైపోయిన ఆహరం పెడుతున్నారని ఆరోపిస్తూ వీడియో రిలీజ్ చేయడం అది సంచలనం రేపిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఆరోపణల నేపథ్యంలో తేజ్ బహదూర్ ను విధుల నుంచి తప్పించారు. విధుల నుంచి తప్పించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనికుల కోసం పనిచేస్తానని తెలిపాడు. 

2019లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తొలుత అతను నామినేషన్ దాఖలు చేసాడు. కానీ అనూహ్యంగా తమ అభ్యర్థిని తప్పించి తేజ్ బహదూర్ కు టిక్కెటిచింది సమాజ్ వాదీ పార్టీ. కానీ ఎన్నికల అధికారులు ఇతని నామినేషన్ ని తిరస్కరించడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని లేపింది. 

ఈ తతంగం అనంతరం జేజేపీలో చేరడం,ఖట్టర్ పై పోటీ చేసి ఓడిపోవడం జరిగాయి. జేజేపీ బీజేపీతోని కలవడాన్ని తేజ్ బహదూర్ తీవ్రంగా తప్పుపట్టారు.ఈ విషయమై మరో వీడియోను విడుదల చేసాడు. ప్రజలను దుశ్యంత్ చౌతాలా తీవ్రంగా మోసం చేసాడని ఆయన దుయ్యబట్టారు. జేజేపీ,బీజేపీకి బీ టీం లా వ్యవహరిస్తుందని, రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించారు. 

నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుశ్యంత్ చౌతాలా పార్టీ జేజేపీ 10 సీట్లను గెల్చుకొని, హంగ్ అసెంబ్లీ నేపథ్యంలో కీలకంగా మారింది. బీజేపీ దుశ్యంత్ చౌతాలాకు ఉపముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.