జమ్మూకాశ్మీర్‌లో చాలా రోజుల తర్వాత భద్రతా దళాలు అతిపెద్ద ఆపరేషన్ నిర్వహించాయి. అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

బిజ్‌బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో బుధవారం ఉదయం పోలీసులు, సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న భద్రతా సిబ్బందిపై ముష్కరులు కాల్పులకు దిగడంతో సైన్యం ఎదురుదాడికి దిగింది.

ఈ క్రమంలో ఓ భవంతిలోకి చొరబడిన తీవ్రవాదులు.. సైనికులపై కాల్పులకు దిగారు. దీంతో ఆ ఇంటిని చుట్టుముట్టిన భద్రతా సిబ్బంది ముగ్గురు ముష్కరులను హతమార్చాయి.

భీకరకాల్పుల నేపథ్యంలో ప్రజలను సైన్యం ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వారుగా తెలుస్తోంది.

కాగా.. గాందర్బల్ అడవుల్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదుల్ని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం రోజులుగా భద్రతా సిబ్బంది గాందర్భల్ అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు.

దుర్బేధ్యంగా ఉండే ఈ కీకరారణ్యం ద్వారా ముష్కరులు పుల్వామా, అనంత్ నాగ్, అవంతిపొరా వంటి ప్రాంతాలకు సులభంగా చేరుకోగలుగుతున్నారు. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన ఈ ప్రాంతంపై పట్టుకోసం సైన్యం గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది.