మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌ను  Enforcement Directorate అధికారులు ప్రశ్నిస్తున్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసు సంబంధించి ఈడీ అధికారులు నవాబ్ మాలిక్‌ను విచారిస్తున్నారు.

మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌ను Enforcement Directorate అధికారులు ప్రశ్నిస్తున్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసు సంబంధించి ఈడీ అధికారులు నవాబ్ మాలిక్‌ను విచారిస్తున్నారు. బుధవారం ఉందయం 7 గంటలకు నవాబ్‌ మాలిక్‌ను ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లిన అధికారులు.. విచారణ కొనసాగిస్తున్నారు. దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఈడీ కార్యాలయానికి నవాబ్ మాలిక్ ఉదయం 8 గంటలకు వచ్చారని.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తోందని అధికారులు తెలిపారు. 

ఇందుకు సంబంధించి శివసేన అధికార ప్రతినిధి ఎంపీ సంజయ్ రౌత్ విలేకరులతో మాట్లాడుతూ.. మాలిక్‌ను అతని ఇంటి నుంచి ఈడీ తీసుకెళ్లిందని తెలిపారు. ఇది మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా తాను భావిస్తున్నట్టగా చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారించే స్వేచ్చ ఉందన్నా. పాత అంశాలను తవ్వి తీస్తున్నారని.. 2024 తర్వాత మీపై కూడా విచారణ జరుగుతుందని గుర్తుంచుకోవాలని సంజయ్ రౌత్ కామెంట్ చేశారు. 

ఈ ఘటనపై ఎస్పీపీ అధినేత శరద్ పవర్ స్పందించారు. నవాబ్ మాలిక్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పడం వల్లనే ఆయన ఇబ్బంది పడుతున్నారని శరద్ పవార్ ఆరోపించారు. మాలిక్ బహిరంగంగా మాట్లాడినప్పటి నుంచి ఎన్‌సీపీ అటువంటి చర్యను ఊహించిందని అన్నారు. ‘నవాబ్ మాలిక్ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి. ఈ ఉదయం ఆయనను విచారణకు తీసుకెళ్లే ముందు ఈడీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మాలిక్ కుటుంబం అందించిన సమాచారం ప్రకారం.. ఆయన పారదర్శకంగా విచారణకు సహకరిస్తారు’ అని శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. 

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడి డ్రగ్స్ ఆరపణలపై అరెస్ట్ అయిన తర్వాత నవాబ్ మాలిక్ వార్తలో నిలిచారు. ముంబై ఎన్‌సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై అనేక వ్యక్తిగత, సేవా సంబంధిత ఆరోపణలు చేశారు. వీరి మధ్య కొన్ని రోజుల పాటు మాటల యుద్దం కొనసాగింది. మరోవైపు మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ నవాబ్ మాలిక్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక, అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని సోదరుడు అనీస్, ఇక్బాల్, సహాయకుడు చోటా షకీల్ మరియు ఇతరులపై నమోదైన కేసులో ఈడీ నవాబ్ మాలిక్‌ను విచారిస్తుంది. ఈ కేసుకు సంబంధించి గత వారం దావూద్ ఇబ్రహీం సోదరి దివంగత హసీనా పార్కర్ నివాసంతో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు దాడులు జరిపారు. అలాగే హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్‌ను సోమవారం ఈడీ ప్రశ్నించింది. దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను గత వారం ఈడీ అదుపులోకి తీసుకుంది.