ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందింది. అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్ల  కల్పించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా లోక్ సభలో 124వ రాజ్యంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. 

కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లోత్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయసభల్లో 2/3 వంతు మెజారిటీ అవసరం.
 ఈ బిల్లుపై లోక్ సభలో సుమారు నాలుగున్నర గంటల పాటు చర్చ జరిగింది. 

అనంతరం ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఓటింగ్ ప్రక్రియలో 326 మంది సభ్యులు పాల్గొనగా వారిలో 323 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ముగ్గురు మాత్రం వ్యతిరేకించారు. దీంతో ఈబీసీ రిజర్వేషన్ బిల్లు మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో  ఆమోదం పొందినట్లు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. 

అనంతరం సభను నిరవధిక వాయిదా వేశారు. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఈ బిల్లు బుధవారం రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. లోక్ సభలో బిల్లు పాస్ కావడంతో బీజేపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.