సదరు వ్యక్తి ఎవరికి చెందిన వాడు అని తెలుసుకోవడానికి సాధారణంగా డీఎన్ఏ టెస్టు చేస్తారు. ఇప్పుడు ఇదే డీఎన్ఏ టెస్టు దున్నపోతుకి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దున్నపోతు మాదంటూ మాది అని రెండు గ్రామాల ప్రజలు వాగ్వాదానికి దిగడం గమనార్హం. ఈ క్రమంలో దున్నపోతుడి డీఎన్ఏ టెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన బళ్లారిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మామూలుగా గ్రామదేవతకని గ్రామాల్లో దున్నపోతును వదులుతారు. వాటిని కొద్దిరోజుల తర్వాత బలి ఇస్తారు. అలా అమ్మవారికి సమర్పించిన దున్నపోతు మాదంటే మాదని రెండు గ్రామాల ప్రజలు వాదులాడుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం  రెండునెలల దూడను ఊరు దున్నపోతుగా వదిలేసారు. రెండు గ్రామాల పొలిమేరలల్లోనూ, పొలాల్లోనూ అది తిరుగుతూ బాగా పెరిగింది. అమ్మవారికి దానిని సమర్పించే సమయం వచ్చేసరికి ఇది మాదంతే మాదని శివమొగ్గ జిల్లా హారనహళ్లి - హొన్నాళి బేలిమల్లూరు గ్రామాల ప్రజలు వాదులాటకు దిగారు. డీఎన్‌ఏ పరీక్షపై వాదోపవాదాలు జరిగాయి.

డీఎన్ఏ టెస్టు చేయించాలని ఓ గ్రామస్థులు డిమాండ్ చేశారు. అయితే... జాతరకు వదిలిన దున్నపోతు నుండి రక్తం తీయరాదని, అలా తీస్తే దేవిపూజకు ఆటంకాలు కలుగుతాయని ఇంకో గ్రామస్థులు వాదించారు. దీంతో డీఎన్‌ఏ టెస్ట్‌కు బదులుగా ప్రమాణం చేసేందుకు హొన్నాళికి చెందిన హిరేకల్మఠం చన్నమల్లికార్జున స్వామీజి నేతృత్వంలో రంగం సిద్ధంచేసారు. అయితే ప్రమాణం చేసిన అనంతరం ఇచ్చే తీర్పుకు రెండు గ్రామాలు కట్టుబడి ఉండాలని స్వామీజి కోరారు. 

ఈ ప్రాంతంలో సత్యానికి ప్రతీకగా నిలిచిన హిరేకల్మఠంలోని చన్నప్ప స్వామీజి కట్టముందు ప్రమాణం చేసేందుకు రెడీ అయ్యారు. బేలిమల్లూరు గ్రామస్తుల తరపున మాళగిమని మంజప్ప, హారనహళ్లి గ్రామప్రజల తరుపున శాంతినగర్‌కు చెందిన హనుమంతస్వామిలు ఈ దున్నపోతు మాదంటే మాదని ప్రమాణం చేశారు. ఇంత తతంగం జరిగినా దున్నపోతు ఏ గ్రామానికి చెందాలన్న విషయం తేలలేదు. ఇరు గ్రామాల తరుపున ప్రజలు ఒకే రకమైన ప్రమాణం చేయడంతో పోలీసులు, మఠాధిపతులు కూడా సందిగ్దావస్థలో పడి తీర్పును మరో రోజుకు వాయిదావేసి పంపించారు.