Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: ఢిల్లీలో సోమవారం నుంచి స్కూల్స్ ఓపెన్.. ఆఫీసుల్లో 100శాతం స్టాఫ్‌‌కు ఓకే

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు పడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం స్కూల్స్, కాలేజీలు, శిక్షణ కేంద్రాలను రీఓపెన్ చేయడానికి అనుమతించింది. సోమవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. జిమ్స్, స్పాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, నైట్ కర్ఫ్యూ మాత్రం ఒక గంట తక్కువగా అంటే.. రాత్రి 11 గంటల తర్వాత నుంచి అమలు అవుతుందని పేర్కొంది. 
 

delhi to reopen schools colleges from monday
Author
New Delhi, First Published Feb 4, 2022, 1:57 PM IST

న్యూఢిల్లీ: కరోనా కేసులు(Coronavirus Cases) మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం(Delhi) కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఈ రోజు సమావేశమైంది. ఈ సమావేశంలో పాఠశాలలు(Schools), కాలేజీలు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల పున:ప్రారంభానికి(Re opening) గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. వచ్చే సోమవారం నుంచి జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, స్పాలను తెరవడానికి అనుమతించింది.

కాగా, నైట్ కర్ఫ్యూ మాత్రం అమలు చేయాలనే నిర్ణయించుకుంది. కానీ, కొంత మార్పు చేసింది. ఇప్పుడు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు అవుతున్నది. వచ్చే సోమవారం నుంచి ఈ నైట్ కర్ఫ్యూ రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. పాఠశాలలను దశల వారీగా పున:ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 12వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించనుంది. కాగా, టీకాలు తీసుకోని ఉపాధ్యాయులను స్కూల్స్‌కు అనుమతించబోదు.

కాగా, ఆఫీసులు వంద శాతం సిబ్బందితో పని చేయవచ్చునని డీడీఎంఏ నిర్ణయం తీసుకుంది. కాగా, కారును ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నవారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన తర్వాతి రోజే ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు తగ్గుతున్నదని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. పాజిటివిటీ రేటు అంటే.. వంద టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలే సంఖ్య. ఉదాహరణకు పాజిటివిటీ 30 శాతం ఉన్నదంటే.. ప్రతి వంద కరోనా టెస్టుల్లో 30 మందికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు లెక్క. పాజిటివిటీ రేటు పడిపోతున్నదని కేంద్రం చెప్పడంతో వైరల్ విస్తరణ కాస్త సద్దుమణిగి ఉండవచ్చనే అభిప్రాయానికి వస్తున్నారు. 

ఢిల్లీలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. కేసులతోపాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతున్నది. గురువారం ఢిల్లీలో 2,668 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, 13 కరోనా మరణాలు చోటుచేసుకన్నాయి. కాగా, పాజిటివిటీ రేటు 4.3 శాతం తగ్గింది. జనవరి 13న ఢిల్లీలో 28,867 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆ తర్వాత కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 1,49,394 క‌రోనా కేసులు న‌మోద‌య్య‌యి. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,19,52,712కు చేరింది. కొత్త‌గా 2,46,674 మంది కోవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్ రివ‌క‌రీల సంఖ్య 4,00,17,088కి పెరిగింది. ప్ర‌స్తుతం  14,35,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 1,072 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 5,00,055కు పెరిగింది. దేశంలో ప్ర‌స్తుతం రోజువారీ సానుకూలత రేటు 11% నుండి 9.27%కి పడిపోయింది. వీక్లీ క‌రోనా వైర‌స్ పాజిటివిటీ రేటు 12.03%కి తగ్గింది.

Follow Us:
Download App:
  • android
  • ios