న్యూడిల్లి: కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి బారినపడి సామాన్య ప్రజలే కాదు కేంద్ర మంత్రి సహా వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా వైరస్ సోకి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న డిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

కరోనా లక్షణాలు కనిపించడంతో సిసోడియా సెప్టెంబర్ 14న కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన వైద్యం కోసం లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నాయక్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం ఆయనకు డెంగ్యూ కూడా అటాక్ అవడంతో శరీరంలో ఆక్సిజన్ శాతం పూర్తిగా పడిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో మరింత మెరుగైన వైద్యం కోసం వేరే కార్పోరేట్ ఆస్పత్రికి తరలించారు. 

ఈ మేరకు సిసోడియా హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. గత 24 గంటల్లో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.