delhi air pollution : సరి-బేసి విధానం సత్ఫలితాలనే ఇచ్చింది - సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పిన ఢిల్లీ సర్కార్
సరి-బేసి విధానం సత్ఫలితాలనే ఇచ్చిందని, దాని వల్ల ఢిల్లీలో ఇంధన వినియోగం 15 శాతం తగ్గిందని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. దీని వల్ల ప్రజా రవాణా వినియోగం కూడా పెరిగిందని కోర్టుకు వెల్లడించింది.
వాహన ఉద్గారాలను నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన సరి-బేసి విధానం సత్ఫలితాలనే ఇచ్చిందని, రోడ్డు రద్దీని తగ్గించిందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కార్ సుప్రీంకోర్టుకు గురువారం తేల్చి చెప్పింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం నేపథ్యంలో వాహనాల ఉద్గారాలను నియంత్రించడానికి ఉద్దేశించిన సరి-బేసి విధానాన్ని సుప్రీంకోర్టు 'ఆప్టిక్స్'గా అభివర్ణించిన రెండు రోజుల తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది.
సరి-బేసి పథకం సానుకూల ప్రభావాన్ని చూపిందని అందులో ప్రభుత్వం పేర్కొంది. ఇది ప్రజా రవాణా వాడకం పెరగడానికి దారితీసిందని తెలిపింది. ఈ పథకం వల్ల ఇంధన వినియోగం 15 శాతం తగ్గిందని ఢిల్లీ ప్రభుత్వం ఒక శాస్త్రీయ అధ్యయనాన్ని ఉదహరించింది. ఈ ఏడాది జూలై నుంచి పర్యావరణ పరిహార ఛార్జీ కింద రూ.14 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిపింది.
ఘోరం.. ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు మృతి, 25 మందికి గాయాలు..
ఢిల్లీయేతర రిజిస్టర్డ్ ట్యాక్సీలను ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు నిషేధించలేదని కోర్టు అడిగిన ప్రశ్నకు ఢిల్లీ ప్రభుత్వం సమాధానం ఇస్తూ.. సంపూర్ణ నిషేధం సాధ్యం కాదని తెలిపింది. అయితే ఇంధన రకం, సంఖ్య ఆధారంగా పరిమితులను పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది.
గుడ్ న్యూస్ : ఢిల్లీలో చిరుజల్లులు... వర్షం కారణంగా తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..
కాగా.. వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో సరి-బేసి విధానం ప్రభావాన్ని సుప్రీంకోర్టు సమీక్షించి, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆ విధానాన్ని అమలును ఢిల్లీ ప్రభుత్వం వాయిదా వేసినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం తెలిపారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ వాయు కాలుష్యానికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు నేడు (శుక్రవారం) విచారించనుంది.