భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకి గొప్ప గౌరవం దక్కింది. భారత్ కీ లక్ష్మీ కి బ్రాండ్ అంబాసిడర్ లుగా వీరిద్దరూ ఎంపికయ్యారు. దేశంలో ఎన్నో ఘనతలు సాధించిన మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ దీపావళిని ‘ భారత్ కీ లక్ష్మీ’ పేరుతో జరుపుకుందామని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  

ఈ ఉద్యమంకి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుంది. భారత్‌కీలక్ష్మీ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్‌మీడియాలో కూడా వైరల్ అయింది. కాగా..  ఈ ఉద్యమానికి స్టార్ షట్లర్ పీవీ సింధు, హీరోయిన్ దీపికా పదుకొనే ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారని తాజాగా ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోని కూడా తాజాగా రూపొందించారు.

అనాథలకు అమ్మగా పేరున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతై సప్కాల్ లాంటి వారిని గుర్తు చేస్తూ..ఇలాంటి లక్ష్మిలు ఉన్న ప్రతీ ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయని వీడియోలో పీవీ సింధు, దీపికా పదుకొనే చెప్తున్నారు. ఈ దీపావళి సందర్భంగా భారత్ కీ లక్ష్మి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వివిధ రంగాల్లో అత్యున్నత శిఖరాలు చేరుకున్న అమ్మాయిలను గౌరవించుకునేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ వీడియో ద్వారా దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగ రోజు ప్రతీ ఇంట లక్ష్మీదేవత కొలువుదీరి సుఖసంతోషాలు కలుగుతాయని ప్రజలు విశ్వసిస్తారని ప్రధాని మోదీ అన్నారు.

కాగా, ఈ వీడియోపై ప్రధాని నరేంద్ర ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మన సంస్కృతి మహిళా సాధికారత ఎలా సాధించాలో ఎప్పటి నుంచో చెబుతూ వస్తుంది. ఈ వీడియో ద్వారా పీవీ సింధు, దీపికా పదుకొనేలు భారత్‌ కీ లక్ష్మీ గురించి అద్భుతంగా తెలియజేశారు’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.