ఈ రోజుల్లో మంచి చెప్పినా పిల్లలు తలకెక్కించుకోవడం లేదు సరికదా.. పెద్దలపై ఎదురు తిరుగుతున్నారు. తాజాగా స్నేహాలు వద్దు అన్నందుకు ఓ కూతురు కన్నతండ్రిని దారుణంగా చంపింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు రాజాజీ నగర్ ఐదో బ్లాక్ ఏడో క్రాస్‌లో ఓ వ్యాపారి తన భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. ఆయన కుమార్తె నగరంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో డిగ్రీ చదువుతున్న ప్రవీణ్ అనే యువకుడితో స్నేహం చేస్తోంది. పదే పదే ప్రవీణ్ తమ ఇంటికి రావడాన్ని వ్యాపారి గుర్తించాడు.  దీనికి తోడు తరచుగా ఫోన్‌లో మాట్లాడటంతో కూతురిని మందలించాడు.

మగ పిల్లలతో స్నేహం మానుకోవాలని చెప్పడంతో.. ఆమె తండ్రిపై కోపం పెంచుకుంది. ఆయన అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. అదను కోసం ఎదురుచూస్తోన్న బాలికకు ఆ సమయం రానే వచ్చింది.

ఆదివారం ఉదయం ఆమె తల్లి, తమ్ముడు పాండిచ్చేరి వెళ్లారు. వాళ్లను రైలు ఎక్కించేందుకు స్టేషన్‌కు బయల్దేరేముందు ఆ బాలిక నిద్రమాత్రలు కలిపిన పాలను తండ్రికి ఇచ్చింది.

తిరిగొచ్చి.. గాఢనిద్రలో ఉన్న నాన్నని చూసి స్నేహితుడు ప్రవీణ్‌కు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి ఆయనను కత్తులతో పొడిచారు.  అనంతరం గొంతు కోసి మృతదేహాన్ని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లారు.

బెడ్‌రూంలోని రక్తపు మరకల్ని శుభ్రం చేశారు. ప్రవీణ్ బయట నుంచి పెట్రోల్ తెచ్చి.... మృతదేహంపై చల్లి నిప్పుపెట్టారు. అయితే వారిద్దరిపైనా పెట్రోలు పడి, మంటలు అంటుకోవడందో ఇద్దరూ గాయపడ్డారు.

మంటలు దట్టంగా వ్యాపించడంతో బాలిక మేడపైకి వెళ్లి కేకలు వేయడంతో.. చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారితో పాటు అక్కడికి వచ్చిన పోలీసులు కూపీ లాగగా మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాలికను, ప్రవీణ్‌ను చికిత్స కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.