ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు కులం పేరుతో దళిత వర్గానికి చెందిన మైనర్ బాలుడిపై అమానవీయంగా హింసించారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు కులం పేరుతో దళిత వర్గానికి చెందిన మైనర్ బాలుడిపై అమానవీయంగా హింసించారు. అంతేకాకుండా నిందితుల్లో ఓ వ్యక్తి బలవంతంగా బాలుడి చేత తన పాదాలను నాలుకతో నాకేలా చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాతో వైరల్ అయింది. వీడియోలో బాలుడు చెవులపై చేతులు వేసుకుని నేలపై కూర్చుని ఉన్నాడు. 

ఇక, అక్కడే ఉన్న వాహనాలపై కూర్చొన్న నిందితులు.. బాలుడిని అసభ్యకరమైన మాటలతో దూషించారు. బాలుడు భయంతో వణుకుతుంటే.. అది చూసి నిందితుల్లో కొందరు నవ్వసాగారు. నిందితుల్లో ఒక్కరు బాధిత బాలుడి ఉన్నత కులానికి చెందిన పేరు (ఠాకూర్) చెప్పమని అడిగాడు. అంతేకాకుండా అతడిని దుర్భాషలాడాడు. ‘‘మళ్లీ ఇలాంటి తప్పు చేస్తావా..?’’ అని మరో నిందితుడు బాధిత బాలుడిని ప్రశ్నించాడు. 

ఇక, ఏప్రిల్ 10వ తేదీన ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధిత బాలుడు 10వ తరగతి చదవుతుందని చెప్పారు. ఈ వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు ప్రారంభించినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. బాధితుడి కనుగోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. బాధిత బాలుడు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో.. ఏడుగురిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో కొందరు నిందితులు అగ్ర వర్ణాలకుచెందినవారని తెలుస్తోంది. నిందితుల్లో మైనర్లు కూడా ఉన్నారు. 

‘‘బాధిత విద్యార్థి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అతనిపై దాడి చేసిన వారిపై చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది’’ అని సీనియర్ పోలీసు అధికారి అశోక్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

స్థానికంగా అందుతున్న నివేదికల ప్రకారం.. బాలుడి తండ్రి చాలా ఏళ్ల క్రితం మరణించాడు. ప్రస్తుతం అతడు, తన తల్లి కలిసి ఉంటున్నాడు. బాలుడి తల్లి నిందితుల్లో కొందరికి చెందిన పొలాల్లో పని చేసిందని.. ఆ పని కోసం బాలుడు డబ్బులు అడిగాడు. దీంతో కోపోద్రిక్తులైన నిందితులు బాలుడితో నీచంగా ప్రవర్తించారు. అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా.. దాడి చేశారు. నిందితుల్లో ఒకరు బలవంతంగా బాలుడి చేత అతడి పాదాలు నాకేలా చేశాడు.