Asianet News TeluguAsianet News Telugu

సైరస్ మిస్త్రీ మృతి.. పోస్టుమార్టమ్ నివేదిక ఏం చెబుతుందంటే..?

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహానికి పోస్టుమార్టమ్ పూర్తికాగా.. ప్రాథమిక నివేదిక బయటికొచ్చింది. 

Cyrus Mistry death Autopsy initial report reveals he Had Head Heart Injuries
Author
First Published Sep 6, 2022, 4:59 PM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహానికి పోస్టుమార్టమ్ పూర్తికాగా.. ప్రాథమిక నివేదిక బయటికొచ్చింది. అందులో ఆయన ఛాతీ, తల, తొడపై తీవ్ర గాయాలున్నట్టుగా తేలింది. పాలీట్రామా ఉందని వెల్లడించింది. పాలీట్రామా అనేది ఒక వ్యక్తి కీలకమైన అంతర్గత అవయవాలకు అనేక గాయాలైనప్పుడు సంభవిస్తుంది. ఇదిలా ఉంటే.. మరో రెండు రోజుల్లో వచ్చే పోస్టుమార్టమ్ తుది నివేదికలో సైరస్ మిస్త్రీ మరణానికి కచ్చితమైన కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది. 

ఇక, పోస్టుమార్టమ్ ప్రక్రియలో భాగంగా.. సైరస్ మిస్త్రీ మృతదేహం నుంచి 8 శాంపిల్స్‌ను సేకరించారు. పోస్టుమార్టం ప్రక్రియను కెమెరాలో రికార్డు చేశారు. తదుపరి పరిశీలన కోసం విసెరా నమూనాలను భద్రపరిచారు. మరోవైపు సైరస్‌ మిస్త్రీ అంత్యక్రియలు ఈరోజు ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో జరిగాయి. ఆయన అంత్యక్రియలకు పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇక, సైరస్ మిస్త్రీతో పాటు అదే ప్రమాదంలో మరణించిన ఆయన స్నేహితుడు జహంగీర్ పండోలే మృతదేహాలకు సోమవారం ఉదయం ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జేజే ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. 

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ, ఆయన స్నేహితుడు జహంగీర్ పండోలే మరణించారు. వీరు ప్రయాణిస్తున్న కారు సూర్య నదిపై ఉన్న వంతెనపై వేగంగా వెళ్తున్న సమయంలో డివైడర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మిస్త్రీతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో స్నేహితుడు డారియస్ పండోల్, కారు నడుపుడుతున్న డారియస్ భార్య అనహిత పండోల్ గాయపడ్డారు. వారికి ప్రస్తుతం ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతుంది. 

సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారులోని సీసీటీవీ ఫుటేజీని కూడా పాల్ఘర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిస్త్రీ, అతని స్నేహితులు గుజరాత్‌లోని ఉద్వాడ నుంచి ముంబైకి తిరిగి వస్తుండగా.. మధ్యాహ్నం 2.21 గంటలకు కారు డాప్చారి చెక్ పోస్ట్ గుండా వెళుతున్నట్లు ఫుటేజీ చూపిస్తుంది. ‘‘కారులో వెనుకాల కూర్చున్న మిస్త్రీ, జహంగీర్ పండోల్ ఇద్దరూ సీట్ బెల్ట్ ధరించలేదు. ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్‌లోని చరోటీ చెక్‌పోస్టును దాటిన తర్వాత మెర్సిడెస్ కేవలం తొమ్మిది నిమిషాల వ్యవధిలో 20 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. వారు ప్రయాణిస్తున్న 2017 మెర్సిడెస్ SUV మొత్తం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. అయితే వెనుక ఉన్న ప్రయాణికులకు ఫ్రంట్ ఫేసింగ్ ఎయిర్‌బ్యాగ్‌లు లేవు. సైడ్స్‌కు కేవలం కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. మిస్త్రీ సీటు బెల్ట్ ధరించలేదు. వేగంగా వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొనడంతో అతను చాలా వేగంతో ముందు విసిరివేయబడ్డాడు. ప్రాథమిక విచారణ ప్రకారం అతివేగం మరియు డ్రైవర్ చేసిన “తీర్పు లోపం” ఘోరమైన ప్రమాదానికి కారణం’’ అని పోలీసులు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios