Cyclone Michaung : జల దిగ్భంధంలో చెన్నై.. 3319 కిమీ వరద నీటి కాలువలు ఉన్నప్పటికీ నగరానికి ఎందుకీ పరిస్థితి.. ?
chennai floods : మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నై అతలాకుతలం అవుతోంది. నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. వరద పరిస్థితిని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
tamil nadu rains : మిచౌంగ్ తుఫాను తమిళనాడుపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ తుఫాను వల్ల చెన్నైలో ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల నగరం అతలాకుతలం అయిపోతోంది. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు సబర్బన్ రైల్వే సర్వీసులను నిలిపివేసి ప్రభుత్వ సెలవు ప్రకటించారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లో సోమవారం తెల్లవారుజాము వరకు 340 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చెన్నైపై పశ్చిమ మేఘాలు మందకొడిగా కదులుతుండటంతో సాయంత్రం లేదా రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా.. తుపాను చెన్నై తీరానికి దగ్గరగా ఉండటం, దాని కదలికలు మందగించడంపై చెన్నై కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జె.రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. తుఫాను నిరంతర స్థితి ఫలితంగా భారీ వర్షాలు కురిశాయని, 31 మైక్రో కాలువలు, నాలుగు ప్రధాన కాలువలు, మూడు నదులతో కూడిన డ్రైనేజీ వ్యవస్థకు సవాళ్లు ఎదురయ్యాయని ఆయన వివరించారు.
‘‘31 మైక్రో కాలువలు, నాలుగు ప్రధాన కాలువలు, మూడు నదులు అందుబాటులో ఉన్నప్పటికీ.. అవన్నీ నాలుగు మార్గాల ద్వారా బంగాళాఖాతంలో కలుస్తాయి. అయితే తుఫాను ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో భారీ అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో నీరు సముద్రంలోకి వెళ్లడం లేదు. ఇదే నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది’’ అని కమిషనర్ రాధాకృష్ణన్ తెలిపారు.
చెన్నైలో 3319 కి.మీ వర్షపు నీటి కాలువలు ఉన్నాయని, అయినా ఎందుకు నగరంలో ఈ వరద పరిస్థితి ఉందని తమని చాలా మంది ప్రశ్నిస్తున్నారని రాధాకృష్ణన్ చెప్పారు. అయితే ఈ కాలువ సామర్థ్యానికి మించి వరద నీరు ఉందని, ఈ నీటిని బంగాళాఖాతం స్వీకరించకపోవడం ప్రస్తుతం సవాలుగా మారిందని అన్నారు. ఆటుపోట్లు తగ్గితేనే నీరు బయటకు వెళ్తుందని తెలిపారు. అలాగే జరిగితేనే తాము నీటిని త్వరగా బయటకు పంపించగలుగుతామని అన్నారు. తమ వద్ద దాదాపు 1000 నీటిని తోడే పంపులు, చెట్ల నరికివేత పరికరాలు ఉన్నాయని వీటిని ఉపయోగించుకుంటున్నామని, వరద పరిస్థితిని తగ్గించేందుకు నిపుణులతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు.