వివాహేతర సంబంధంతో భర్తను భార్య, భార్యను భర్త చంపడం మామూలైపోతున్న రోజుల్లో.. ఆ సంబంధాన్ని వదులుకోలేక తామే ఆత్మహత్యకు పాల్పడిన జంట ఉదంతమిది. ఈ విషాద ఘటనలో ప్రియుడు మరణించగా, ప్రియురాలు కోలుకుంది.. షాకింగ్ గా ఉన్న ఈ సంఘటన వివరాల్లోకి వెడితే..

చెన్నైలోని తెల్లరాళ్లపల్లెకు చెందిన దిలీప్‌ కుమార్‌(22) అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల వివాహితతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇది ఆమె భర్తకు తెలిసింది. అతను వీళ్లిద్దరినీ మందలించాడు. అయినా వీరి తీరు మారలేదు. ఈ నేపథ్యంలో మరోసారి తీవ్రంగా హెచ్చరించాడు. 

దీని తరువాత ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ వారిద్దరూ ఆదివారం మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. వీరిద్దరూ పారిపోయారనుకున్నారు. వారికోసం గాలింపు చేపట్టగా మండలంలోని దొనిరేవులపల్లెకు ఆనుకుని ఉన్న తమిళనాడు సరిహద్దులోని అటవీప్రాంతంలో విషం సేవించి స్పృహ కోల్పోయిన స్థితిలో దొరికారు.

వీరిని వెంటనే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించగా.. దిలీప్ అప్పటికే చనిపోయాడు. వివాహిత సాయంత్రానికి స్పృహలోకి వచ్చింది. ఇంతలో వారి బంధువులు గాలిస్తూ అక్కడికి చేరుకున్నారు. ఆమెను చీలాపల్లె సీయంసీకి తరలించడంతో పూర్తిగా కోలుకుంది. చిత్తూరులో పోస్టుమార్టం అనంతరం దిలీప్‌ మృతదేహాన్ని సోమవారం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.