వివాహితులే అతని టార్గెట్. ముందు అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ పంపుతాడు. ఆ తర్వాత మెసెంజర్ లో మెసేజ్ లు చేయడం మొదలుపెడతాడు. వాటికి రెస్పాండ్ అయితే చాలు.. ఇక వీడియోలు కాల్స్ చేయడం మొదలుపెడతాడు. అది కూడా నగ్నంగా తయారై కాల్స్ చేస్తాడు. వాటికి రెస్పాండ్ అవ్వకపోతే... ఫేస్ బుక్ లో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం.. ఫేస్ బుక్ లోని ఫోటోలను తీసుకొని వాటిని  మార్ఫింగ్ చేసి పంపడం లాంటివి చేస్తాడు. ఇప్పటి వరకు ఎంతో మంది వివాహితులను అతను అలా బ్లాక్ మెయిల్ చేయగా... కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ఈనెల 19వ తేదీన ఓ అధికారి భార్యకు సాక్షి అనే పేరుతో ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమ్మాయే కదా అని ఆమె యాక్సెప్ట్ చేసింది. మరుసటి రోజు ఆ వ్యక్తి నుంచి మెసేంజర్ లో మెసేజ్ వచ్చింది. దానికి ఆమె కూడా రెస్పాండ్ అయ్యింది. కొద్ది సేపటికి ఆ పేరు నుంచి ఫేస్ బుక్ వీడియో కాల్ వచ్చింది.

అమ్మాయే కదా కాల్ చేసింది మాట్లాడితే ఏమౌతుందిలే అని ఆమె లిఫ్ట్ చేయగా... ఓ వ్యక్తి నగ్నంగా నిలబడి వీడియోలో కనిపించాడు. దీంతో ఆమె కంగారుపడి ఫోన్ కట్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసిన సమయంలో స్క్రీన్ షాట్స్ తీశానని.. తనతో వీడియో కాల్ మాట్లాడకుంటే ఫోటో మార్ఫింగ్ చేస్తానంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. 

ఆమె పట్టించుకోకపోవడంతో ఫేస్ బుక్ లో అసభ్యకర పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు రోజు రోజుకీ ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. మరో అధికారి భార్య కూడా అతనిపై ఫిర్యాదు చేసింది. ఇద్దరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.