బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలడంతో దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు కూటమిల పేరు చెప్పుకున్న నేతలు సైతం తాము ఏ కూటమిలో లేము తటస్థంగా ఉన్నాం అంటూ ప్రకటనలు చేసేసుకుంటున్నారు. 

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రోషన్ బేగ్ గుడ్ బై చెప్పేయోచనలో ఉన్నారు. తాను పార్టీని వీడనున్నట్టు పరోక్షంగా స్పష్టం చేశారు. 

ఎన్డీయే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటే ముస్లింలు సైతం రాజీ పడాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థికి అనుగుణంగా రాజీపడాలని ముస్లిం సోదరులకు అప్పీల్ చేశారు. బీజేపీతో ముస్లింలు అవసరమైతే చేతులు కలపాల్సి ఉంటుందన్నారు అంతేకానీ ఒక పార్టీకి ముస్లింలు విధేయులుగా ఉండిపోరాదన్నారు. 

కర్ణాటకలో ముస్లింలకు జరిగిన దేమిటి? కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు మాత్రమే ముస్లింలకు ఇచ్చిందని రోషన్ బేగ్ ఎద్దేవా చేశారు. గౌరవం ఇవ్వని పార్టీలో తాము ఉండలేమని, హుందాగా, గౌరవంతో జీవించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. 


ఎవరైతే ప్రేమ, ఆప్యాయతలతో ముందుకొస్తారో వారితోనే తాము కలిసి ఉంటామంటూ కాంగ్రెస్ పై అక్కసు వెళ్లగక్కారు. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గూండూరావు, సిద్ధరామయ్య సహా సీఎల్‌పీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని కూడా సరిగా నిర్వహించలేకపోయారని విమర్శించారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి వారే కారణమంటూ ఆరోపించారు. పరిస్థితిని బట్టి కాంగ్రెస్‌ను వీడతానని అనంతరం బీజేపీలోకి వెళ్తానని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్.