బెంగళూరు ఎయిర్‌పోర్టులో రూ. 10కే భోజనం.. రూ.5కే అల్పాహారం , సిద్ధరామయ్య సర్కార్ సంచలన నిర్ణయం
సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగళూరు విమానాశ్రయంలో రూ.10కే భోజనం, రూ.5కే టిఫిన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ‘ఇందిరా క్యాంటీన్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించింది.
భారత ఐటీ రాజధాని, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో జీవన వ్యయాలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ లక్షల్లో జీతాలు వచ్చిన బతకలేని పరిస్ధితి .. టీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా, భోజనం చేయాలన్నా వందలాది రూపాయలు సమర్పించుకోవాల్సిందే. అలాంటిది ఒక సామాన్యుడు బెంగళూరులో బతకాలంటే మామూలు విషయం కాదు.
బయటే పరిస్ధితులు ఇలా వుంటే నగరంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయంలో రూ.10కే భోజనం, రూ.5కే టిఫిన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ‘ఇందిరా క్యాంటీన్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించింది.
కేబినెట్ తీర్మానం మేరకు విమానాశ్రయంలో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖరీదైన ఫుడ్ ఔట్ లెట్లలో ధరలను సామాన్యులు భరించలేరన్న యోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ పథకం అమలౌతున్న సంగతి తెలిసిందే. దీనిని తాజాగా విమానాశ్రయానికి కూడా విస్తరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ ప్రదేశంలో 2 క్యాంటీన్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు.. బెంగళూరు నగరంలో 175కి పైగా ఇందిరా క్యాంటీన్‌లు ప్రజల కడుపు నింపుతున్నాయి. ప్రతి నిత్యం బెంగళూరుకు వివిధ రకాల పనులపై వచ్చే కార్మికులు, ఉద్యోగులు, సందర్శకులకు ఈ క్యాంటీన్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి . కర్ణాటకలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ క్యాంటీన్‌లు కేవలం రూ.5కే టిఫిన్.. రూ.10కే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.