Punjab Assembly Election 2022: ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగున్న రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ అమృత్‌సర్‌లో నామినేషన్ వేశారు.
Punjab Assembly Election 2022: ఫిబ్రవరిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీటు పెంచాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని ప్రధానపార్టీలు పంజాబ్ లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. అయితే, ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ అమృత్‌సర్‌లో నామినేషన్ వేశారు.
శనివారం నాడు నామిషనేషన్ దాఖలు చేసిన నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ.. అమృత్ సర్ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. తనకు సంబంధించిన వివరాలు.. విద్యార్హతలు, ఆస్తుల వివరాలను పొందుపర్చిన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇందులో ప్రస్తావించిన వివరాల ప్రకారం.. సిద్దుకూ భారీగా ఆస్తులు ఉన్నాయి. నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో సిద్ధూ మొత్తం ఆస్తుల విలువ ₹ 44.63 కోట్లుగా ప్రకటించారు. ఇందులో అతని భార్య, మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూ ₹ 3.28 కోట్లు సహా ₹ 41.35 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో (2016-2017) తన వార్షిక ఆదాయం రూ.94.18 లక్షలు ఉండగా.. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి రూ.22.58 లక్షలకు తగ్గిందని పేర్కొన్నారు
తన అఫిడవిట్ లో దాఖలు చేసిన చరాస్తులు వివరాల గమనిస్తే.. చరాస్తుల్లో రూ.1.19 కోట్లు విలువైన రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్లు ఉన్నాయి. అలాగే, రూ.11.43 కోట్ల విలువైన టయోటా ఫార్చ్యూనర్ వాహనంతో పాటు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.44 లక్షల విలువచేసే వాచ్‌లు ఉన్నట్టు సిద్ధూ పేర్కొన్నారు. ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్దూ రూ.70లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయని వెల్లడించారు. తనకు వ్యవసాయ భూమి లేదని పేర్కొన్న సిద్దూ.. పటియాలలో ఆరు షోరూమ్‌ల స్థిరాస్తుల ఉన్నాయని తెలిపారు. పాటియాలాలో ₹ 1.44 కోట్ల రూపాయల విలువైన 1,200 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న తన నివాస గృహాన్ని, వారసత్వంగా సంక్రమించిన ఆస్తి అని సిద్ధూ ప్రకటించారు . అతను అమృత్‌సర్‌లో సుమారు ₹ 34 కోట్ల విలువైన 5,114 చదరపు గజాల నివాస ఆస్తి కూడా ఉందని నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్ పత్రాల్లో పేర్కొన్నారు.
తన విద్యార్హతల గురించి ప్రస్తావించిన సిద్దూ.. 1986లో పాటియాలాలోని పంజాబీ యూనివర్శిటీ నుండి BA పూర్తి చేసినట్టు తెలిపారు. మ్మెల్యేగా తనకు అందుతున్న జీతం, అద్దె ఆదాయం, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) నుండి వస్తున్న పెన్షన్ లను తన ఆదాయ వనరులని ప్రకటించాడు. పంజాబ్‌లో ఒకే దశలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ 77 సీట్లు గెలుపొంది.. సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 117 మంది సభ్యుల పంజాబ్ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాలను గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) 15 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది, బీజేపీ 3 సీట్లు సాధించింది.
