రాముడి ఉనికినే కాంగ్రెస్ ఖండించింది.. ఆలయం వద్దని కోర్టుకు వెళ్లింది - బీజేపీ
రామాలయ ప్రారంభోత్సవాని (ayodhya ram mandir opening)కి కాంగ్రెస్ (congress) నాయకులు రాకపోవడంలో ఆశ్చర్యం లేదని బీజేపీ (bjp)పేర్కొంది. రామాలయం నిర్మించకుండా ఆ పార్టీ కోర్టుకు సీనియర్ న్యాయవాదులను పంపించిందని ఆరోపించింది.
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాలేనని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తేల్చి చెప్పారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఈ విషయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ మాట్లాడుతూ.. అయోధ్యలో మందిరం నిర్మించేందుకు కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. నిజానికి రాముడి ఉనికిని ఖండిస్తూ కాంగ్రెస్-యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆరోపించారు. ‘‘దాని కోసం వారు (కాంగ్రెస్ నాయకులు) కోర్టులో నిలబడ్డారు. త్వరగా విచారణను కోరుకోలేదు.’’ అని అన్నారు.
అయితే ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయ్యిందని అన్నారు. కానీ ఆ పార్టీ తమ నమ్మకానికే కట్టుబడి ఉందని తెలిపారు. ఆ పార్టీ అక్కడ ఆలయం వద్దని అంటోందని చెప్పారు. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు చెందినదే అని భావిస్తోందని తెలిపారు. వాస్తవానికి రామాలయం కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు భిన్నంగా ఉందని అన్నారు. లేకపోతే రాముడిపై అభిమానంతో ఆ పార్టీ నాయకులు అయోధ్యకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతదేశంలోని కోట్లాది మంది భారతీయుల ఉత్సాహాన్ని పంచుకునేవారని తెలిపారు.
కాగా... కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా కాంగ్రెస్ నిర్ణయంపై స్పందించారు. కాంగ్రెస్ నేతలు తమ వాక్చాతుర్యంలో ఇరుక్కుపోయారని, వారిని ఎందుకు సీరియస్ గా తీసుకుంటారని ప్రశ్నించారు. వెళ్లకపోతే వాళ్లే పశ్చాత్తాపపడతారని తెలిపారు. దీనిపై మరో బీజేపీ నేత, లోక్ సభ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ‘‘వారు (కాంగ్రెస్ నేతలు) దర్శనానికి ఎలా వెళ్తారు ? . అక్కడ రామమందిరం నిర్మించకుండా చూసేందుకు ఆ పార్టీ సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దింపింది వాస్తవం కాదా?’’ అని అన్నారు.
‘‘వారు (కాంగ్రెస్) రాముడిని కాల్పనిక పాత్ర అని అన్నారు. రామసేతును తిరస్కరించారు. మొదటి నుంచి వారి మనస్తత్వం ఇదే. వారి ఆలోచనా విధానం మారుతుందని నేను అనుకోవడం లేదు.. కానీ దేశ ప్రజలు మాత్రం శ్రీరాముడితో పాటు ప్రధాని మోడీ కూడా తమ మదిలో నివసిస్తున్నారనే సందేశాన్ని ఇచ్చారు. రాముడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకే కాదు ప్రతి ఒక్కరికీ చెందినవాడు. రాముడు తమవాడు కాదని కాంగ్రెస్ భావిస్తే అది వారి సమస్య’’ అని అన్నారు.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం పూర్తిగా ఆర్ఎస్ఎస్-బీజేపీ కార్యక్రమం అని పేర్కొంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రామ మందిర ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన నేపథ్యంలో బీజేపీ ఈ విధంగా స్పందించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి రామ మందిర ప్రారంభోత్సవానికి రాలేమని తేల్చి చెప్పారు. కాగా.. జనవరి 22 జరిగే అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని గత నెలలో వీరందరికీ ఆహ్వానం అందింది.