భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా కాంగ్రెస్ కుట్రలు : పార్లమెంట్ లో బిజెపి ఎంపీ సంచలనం
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దేశద్రోహానికి పాల్పడుతోందంటూ బిజెపి ఎంపీ నిషికాంత్ ధూబే పార్లమెంట్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు.
భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు విదేశీ సంస్థలతో కాంగ్రెస్ చేతులు కలిపిందని జార్ఖండ్ ఎంపి నిషికాంత్ ధూబే సంచలన ఆరోపణలు చేసారు. సోరోస్ వంటి విదేశీ ఏజన్సీలు, ఏజెంట్లు చెప్పినట్లు కాంగ్రెస్ చేస్తోందని...దీనివల్ల భారత్ కు ముప్పు పొంచివుందని ఎంపీ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ మేరకు నిషాంత్ ధూబే పార్లమెంట్ లో చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి.
భారత అత్యున్నత పార్లమెంట్ ను కూడా నడవకుండా చేసేలా కుట్రలు జరిగాయని ఎంపీ పేర్కొన్నారు. పెగాసస్, కోవిడ్ వ్యాక్సిన్ పై దుష్ప్రచారం ఈ కుట్రలో భాగమేనని... వీటిగురించి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో ప్రియాంగ గాంధీ, ఇతర నేతలు ట్వీట్లు చేసిన విషయాన్ని గుర్తుచేసారు. ఓపెన్ సొసైటి ఫౌండేషన్ ప్రతినిధులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారని ఎంపీ తెలిపారు.
మరో ఎంపీ,బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా ఇదే అనుమానాలను వ్యక్తం చేసారు. విదేశీ కుట్రల్లో భాగమైన రాహుల్ గాంధీ పెద్ద దేశద్రోహిగా అభివర్ణించారు. భారత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎప్పుడెప్పుడు దెబ్బతీద్దామా అని ఎదురుచూస్తున్న శత్రువులతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపిందని సంబిత్ పాత్రా ఆరోపించారు.
భారత్ పై కుట్రలో భాగస్వాములు వీరే :
భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని, పాలనను అస్థిరపర్చాలని చాలా మంది చూస్తున్నారని సంబిత్ పాత్ర ఆందోళన వ్యక్తం చేసారు. ఇలా జార్జ్ సోరోస్ ఓవైపు అమెరికాలో కూర్చుని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తన ఫౌండేషన్ తో పాటు మరికొన్ని ఏజన్సీల ద్వారా సోరోస్ కుట్రలు పన్నుతున్నాడని అన్నారు. మరోవైపు మరో పెద్ద న్యూస్ పోర్టల్ OCCRP (Organised Crime and Corruption Reporting Project) కూడా కుట్రలో భాగమయ్యిందని అన్నారు. చివరగా బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న రాహుల్ గాంధీ కూడా ఈ కుట్రలో కీలక భాగమని పాత్రా సంచలన వ్యాఖ్యలు చేసారు. కాబట్టి ప్రతిపక్ష నేతను దేశద్రోహి అనడానికి తాను ఏమాత్రం సంకోచించడం లేదన్నారు.
అంతర్జాతీయ మీడియా ఏజన్సీ OCCRP కి జార్జ్ సోరోస్ కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఫండింగ్ చేస్తోందని పాత్రా ఆరోపించారు. కాబట్టి ఈ ఫండింగ్ చేసినవారికి అనుకూలంగానే ఆ సంస్థ పనిచేస్తోందన్నారు. ఇండియాకు వ్యతిరేకంగా వుండే ఈ మీడియా ఏజన్సీ రిపోర్టులను రాహుల్ గాంధీ ఉపయోగిస్తుంటారని సంబిత్ పాత్ర పేర్కొన్నారు.