పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. మద్యం మత్తులో పవిత్ర గురుద్వారాలోకి ఆయన ప్రవేశించారని సీఎంపై ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు.
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి (punjab chief minister) భగవంత్ మాన్ (bhagwant mann) వివాదంలో చిక్కుకున్నారు. శనివారం సీఎంపై ఆ రాష్ట్ర పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. మద్యం మత్తులో భగవంత్ మాన్ గురుద్వారాలోకి ప్రవేశించారని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీకి (bjp) చెందిన యువనేత తేజిందర్ పాల్ సింగ్ బగ్గా (Tajinder Pal Singh Bagga) నేరుగా పంజాబ్ డీజీపీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఈ మేరకు భగవంత్ మాన్‌పై తాను పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రతులను బగ్గా సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ నెల 14న వైశాఖి సందర్భంగా తాగిన మత్తు ఇంకా దిగకుండానే గురుద్వారాలోకి ప్రవేశించారంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) (shiromani gurdwara parbandhak committee) భగవంత్ మాన్‌పై శుక్రవారం సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి భగవంత్ మాన్ క్షమాపణ చెప్పాలని కూడా ఎస్జీపీసీ డిమాండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి మాన్‌పై కేసు నమోదు చేయాలంటూ బగ్గా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
కాగా.. పంజాబ్‌లో భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శనివారంతో నెల రోజులు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రకటించింది. జులై 1 నుంచి ఈ ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు పంజాబ్ సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది.
2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఉచిత విద్యుత్ వాగ్దానం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు దీనిని అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదే విషయంలో గత మంగళవారం సీఎం భగవంత్ మాన్ మాట్లాడారు. తమ ప్రభుత్వం త్వరలో రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పబోతోందని అన్నారు. ఇటీవలే AAP అధికార ప్రతినిధి మల్విందర్ సింగ్ కాంగ్ కూడా పంజాబ్‌లో ఉచిత విద్యుత్ సరఫరా ప్రకటన త్వరలో రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడిన మల్విందర్ కాంగ్.. ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి పంజాబ్ ప్రభుత్వం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోందని అన్నారు. అది దాదాపుగా పూర్తి కావొస్తోందని, ఈ విషయంలో త్వరలోనే ప్రకటన వెలువడుతుందని చెప్పారు.
ఇదిలా ఉండగా పంజాబ్ రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 10 ఎకరాలు, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులపై ‘‘ట్యూబ్‌వెల్ బిల్లులు’’ విధించనున్నట్లు తనకు తెలిసిందని భోలాత్‌లోని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే సుఖపాల్ సింగ్ ఖైరా శుక్రవారం ఆరోపించారు. ఈ మేరకు ట్విట్లర్ లో పోస్ట్ చేశారు. “భగవంత్‌మాన్ ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ చేయడానికి కొంటెగా వెళుతోందని నేను తెలుసుకున్నాను! వారు 10 ఎకరాలు, అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు ట్యూబ్‌వెల్ బిల్లులు విధించనున్నారు. అలా పొదుపు చేసి అందులో నుంచి 300 యూనిట్లు ఉచితంగా ఇస్తారు ! ఈ ఉచిత విద్యుత్ హామీ ఇస్తున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ మోసాన్ని చెప్పలేదు ! ’’ అని ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం వ్యవసాయ రంగానికి పంజాబ్ రాష్ట్రం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది.
