సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టు నోటీసులు
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే పలువురు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మంపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి

సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వానికి, డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఎంపీలు ఎ.రాజా, తిరుమావళవన్, వెంకటేశన్, తమిళనాడు డీజీపీ, గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్, కేంద్ర హోంశాఖ, హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు, తమిళనాడు రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ పీటర్ అల్ఫోన్స్ తదితరులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇటీవల ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చిన సంగతి తెలిసిందే. ఇవి దేశ వ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారాన్నే రేపాయి. దీంతో పాటు అనేక వర్గాల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ విమర్శలను పట్టించుకోని ఉదయనిధి స్టాలిన్.. ఈ వివాదంపై నమోదైన అన్ని కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తాను ఎలాంటి న్యాయపరమైన సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ సాధారణ కాషాయ బెదిరింపులకు లొంగబోనని ఉదయనిధి స్పష్టం చేశారు.
‘‘ఎలాంటి న్యాయపరమైన సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి సాధారణ కాషాయ బెదిరింపులకు మేం లొంగబోం. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుయాయులు అయిన మేము సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి, తమిళనాడు సీఎం సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో సమసమాజాన్ని స్థాపించడానికి ఎప్పుడూ పోరాడతాము’’ అని ఆయన గతంలో ట్వీట్ చేశారు.
సెప్టెబర్ 2వ తేదీన నిర్వహించిన 'సనాతన నిర్మూలన సదస్సు' తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకమని అన్నారు. దాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూ జ్వరంతో పోల్చారు. ఇది వివాదాస్పదంగా మారింది. ‘‘దోమలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా, కరోనా, ఇవన్నీ మనం వ్యతిరేకించలేనివి, వాటిని నిర్మూలించాలి. సనత్నం కూడా అలాంటిదే’’ అని తెలిపారు.