హైదరాబాద్ బాటలోనే ఉత్తర ప్రదేశ్ : సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు
ఉత్తర ప్రదేశ్ ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడుతోందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ పోటీ ఏ విషయంలో తెలుసా?
గోరఖ్‌పూర్, అక్టోబర్ 10: జ్ఞానం, విజ్ఞానం, సాంకేతికత భారతీయుల డీఎన్ఏలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అపార అవకాశాలతో నిండిన మన యువత వైపు ప్రపంచం ఆశతో చూస్తోందన్నారు. రాబోయే కాలం భారతదేశానిదే... యువత పోరాటాల ద్వారా తమ దారిని ఏర్పరచుకుంటే విజయం వరిస్తుందిని సీఎం యోగి అన్నారు.
గురువారం గోరఖ్‌పూర్‌లోని మహారాణా ప్రతాప్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంపీఐటీ) విద్యార్థులతో సీఎం యోగి కలిసారు. ఈ సందర్భంగా వారితో కాస్సేపు ముచ్చటించారు. మన దేశంలో జ్ఞానం, విజ్ఞానం, శ్రమ అనే త్రివేణి నిరంతరం ప్రవహిస్తోందని... సంప్రదాయం, శ్రమ, పురోగతి మన స్వభావంలో భాగమని... ఇదే మనల్ని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలుపుతోందని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రపంచ స్థాయికి అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని యోగి సూచించారు. తల్లిదండ్రుల ఆశలను కూడా అందుకోవాలి... దీనికోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ పత్రికలను క్రమం తప్పకుండా చదవాలి విద్యార్థులకు సూచించారు. ఈ-లైబ్రరీ వైపు అడుగులు వేయాలన్నారు.
జీవితాన్ని సులభతరం చేసే, సమస్యలకు పరిష్కారాలను అందించే సాంకేతికతపై దృష్టి పెట్టాలన్నారు. ప్రకృతితో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సాంకేతికతపై దృష్టి సారించాలని సీఎం యోగి సూచించారు.
ఉపాధి కేంద్రంగా ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ నేడు ఉపాధికి పెద్ద కేంద్రంగా మారుతోందని విద్యార్థులను ఉద్దేశించి సీఎం యోగి అన్నారు. నేటి సాంకేతిక యుగంలో కీలకమైన సెమీకండక్టర్ హబ్‌గా ఉత్తరప్రదేశ్ చాలా ముందుకు వెళ్లిందని ఆయన తెలిపారు. దీనిలో ప్రత్యక్ష పెట్టుబడులతో పాటు పరోక్ష పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా శిక్షణ పొందిన శ్రామిక శక్తిని అందించాల్సిన బాధ్యత సాంకేతిక సంస్థలపై ఉంది.
కంప్యూటర్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సిలికాన్ వ్యాలీలో భారతదేశం పెద్ద పాత్ర పోషిస్తోందని, అందులో ఉత్తరప్రదేశ్ యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం వహిస్తోందని సీఎం యోగి అన్నారు. సిలికాన్ వ్యాలీ, హైదరాబాద్, బెంగళూరు తర్వాత ఉత్తరప్రదేశ్ కూడా ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ లక్ష్యంతోనే తూర్పు ఉత్తరప్రదేశ్‌లో తొలి స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఎంపీఐటీలో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని మరో 15 సాంకేతిక విద్యా సంస్థలకు కీలక కేంద్రంగా మారుతుంది. ఎంపీఐటీ క్యాంపస్‌లోని వివిధ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో డ్రోన్ టెక్నాలజీ అండ్ 3డీ ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీతో సహా అనేక ఇంటిగ్రేటెడ్ కోర్సులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ స్థాయి కోర్సులతో అనుసంధానమై, ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సులు, మైనర్ డిగ్రీ కోర్సులు, అడ్వాన్స్‌డ్ కోర్సుల ద్వారా సంబంధిత పరిశ్రమ, సేవా రంగాలకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము సిద్ధం చేసుకోవచ్చని సీఎం యోగి అన్నారు.
ఇక సీఎం యోగి ఫ్యాకల్టీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచ మార్కెట్ డిమాండ్‌ను అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా కోర్సులను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఆధునిక కోర్సులపై దృష్టి పెట్టాలని.... టాటా కన్సల్టెన్సీ ఈ విషయంలో చాలా కృషి చేస్తోందన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆధునిక కోర్సులపై దృష్టి సారిస్తే వంద శాతం ఉద్యోగాలు లభిస్తాయని ఆయన అన్నారు.
ఐదేళ్లలో యూపీ టాప్ ఇన్‌స్టిట్యూట్‌గా ఎంపీఐటీ
1956లో మహారాణా ప్రతాప్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తొలి పాలిటెక్నిక్‌ను ప్రారంభించిందని, నేడు అది రాష్ట్రంలోని టాప్ పాలిటెక్నిక్‌లలో ఒకటిగా ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ ప్రేరణతో మనం కలిసి ఐదేళ్లలో ఎంపీఐటీని యూపీలో టాప్ ఇన్‌స్టిట్యూట్‌గా తీర్చిదిద్దాలన్నారు. దీనికోసం సంస్థను పరిశ్రమలతో అనుసంధానించాలని... యువతకు నిరంతరం నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు.