లవ్ జిహాద్ లాగే ల్యాండ్ జిహాద్ : జార్ఖండ్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో యోగి సంచలనం
జార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లవ్ జిహాద్, చొరబాటు, కుటుంబ రాజకీయాల వంటి అంశాలను లేవనెత్తి సీరియస్ కామెంట్స్ చేసారు.
రాంచీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ పార్టీలన్నీ కుటుంబ పాలనలో మునిగి తేలుతున్నాయని, పేదలను దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు సాయం, మహిళల భద్రత, వ్యాపారుల సంక్షేమం వంటి అంశాలపై వీరికి ఏమాత్రం శ్రద్ధ లేదని... అధికారం అంటే వీరికి దోపిడీకి ఒక సాధనం మాత్రమే అని విమర్శించారు.
జార్ఖండ్ జనాభా కూర్పును మార్చేస్తున్నారని... కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీలు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు, రోహింగ్యాలకు, రాళ్ళ దాడి చేసే వారికి మద్దతు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటివి జార్ఖండ్ ప్రజలకు ముప్పుగా పరిణమిస్తున్నాయని... వీటన్నింటికీ బీజేపీ ఒక్కటే పరిష్కారం అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
సీఎం యోగి భవనాథ్‌పూర్ నుండి భాను ప్రతాప్ షాహి, హుస్సేనాబాద్ నుండి కమలేష్ కుమార్ సింగ్, పంకీ నుండి శశిభూషణ్ మెహతా, డోల్టన్‌గంజ్ నుండి ఆలోక్ కుమార్ చౌరసియా లకు మద్దతుగా ప్రచారం చేశారు. జార్ఖండ్ ప్రజలు ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీ హామీలను గుర్తు చేస్తూ, జార్ఖండ్ ప్రజలను అయోధ్య, ప్రయాగరాజ్ కుంభమేళాలకు ఆహ్వానించారు.
బీజేపీ అంటే అభివృద్ధి, భద్రత, సుపరిపాలన అని సీఎం యోగి అన్నారు. గత ఐదేళ్ళలో జార్ఖండ్ అరాచకం, అవినీతిని చూసింది. పేదల ఖాతాల్లోకి వెళ్ళాల్సిన డబ్బు మంత్రుల, అధికారుల ఇళ్ళలో దొరుకుతోంది. పండగలు, వేడుకలు ప్రశాంతంగా జరగడం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పేదలు ఆకలితో అలమటిస్తున్నారని యోగి అన్నారు.
రామనగర్‌గా హుస్సేనాబాద్
కాశీ, అయోధ్య అద్భుతంగా అభివృద్ధి చెందాయని... 500 ఏళ్ళ తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మితమైందని సీఎం యోగి అన్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ పార్టీలకు ఇది నచ్చడం లేదని, వీరు దేశ భద్రతకు ముప్పు అని ఆయన విమర్శించారు. జార్ఖండ్ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు. బీజేపీ ఇసుక మాఫియాను అంతం చేసి, ఇళ్ళ నిర్మాణానికి ఇసుకను అందిస్తుందని యోగి హామీ ఇచ్చారు.
జార్ఖండ్‌లో గిరిజన జనాభా 44% నుండి 28%కి ఎలా తగ్గిందో హైకోర్టు ప్రశ్నించాల్సి వచ్చిందని సీఎం యోగి అన్నారు. ఇక్కడ ప్రజలకు రక్షణ లేదు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం దేశ ప్రజలందరికీ శుభసూచకం. బీజేపీ అభ్యర్థి కమలేష్ సింగ్ ఈ ప్రాంతాన్ని అయోధ్యలా రామనగర్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఫైజాబాద్‌ను అయోధ్యగా, అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా మార్చినట్లే హుస్సేనాబాద్‌ను రామనగర్‌గా మార్చాలని ఆయన అన్నారు.
లవ్ జిహాద్ కుట్రలో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీల హస్తం
లవ్ జిహాద్ పేరుతో బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాలు కుట్రలు చేస్తున్నారని.... ఈ కుట్రలో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీలు కూడా భాగస్వాములని సీఎం యోగి ఆరోపించారు. గిరిజన యువతులను మోసం చేస్తున్నారని, ఉత్తరప్రదేశ్‌లో లవ్ జిహాద్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎంల ప్రభుత్వాలు ఉన్నప్పుడు పాకిస్తాన్, చైనా చొరబాట్లు చేసేవని... ఇప్పుడు చైనా సైన్యం వెనక్కి తగ్గుతోందని ఆయన అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎంలు సమస్యలు సృష్టిస్తే, బీజేపీ వాటికి పరిష్కారాలు చూపుతుందని యోగి అన్నారు.
మాఫియాను అంతం చేయడానికి నిజాయితీ అవసరం
గత ఐదేళ్ళలో మహిళలపై నేరాలు పెరిగాయని సీఎం యోగి అన్నారు. ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకం ద్వారా ప్రతి నెలా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎంలు హిందూ సంప్రదాయాలను, బిర్సా ముండాను అగౌరవపరిచాయని... మోడీ నవంబర్ 15ని గిరిజన దినోత్సవంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
చొరబాటుదారులను, రోహింగ్యాలను దేశం నుండి వెళ్ళగొట్టలేని వారిని తిరస్కరించాలని యోగి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ లాగే జార్ఖండ్ కూడా అపార అవకాశాలున్న రాష్ట్రమని ఆయన అన్నారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీలు అధికారంలో ఉంటే కావడి యాత్రను కూడా నిలిపివేస్తారని... ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు కావడి యాత్ర ప్రశాంతంగా జరుగుతోందని ఆయన అన్నారు. దేశం సురక్షితంగా, అభివృద్ధి చెందాలంటే ఐక్యత అవసరమని, దేశాన్ని విడగొట్టే వారు దేశద్రోహులని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. .