కర్ణాటక రాష్ట్రం ఉడుపికి చెందిన 77 ఏళ్ల వ్యాపారి గాబ్రియెల్ నజరెత్ క్రైస్తవుడు. ఈ నేపథ్యంలో ఆయన శిర్వాలోని​ తన ఇంటి సమీపంలో సొంత ఖర్చుతో సిద్ధి వినాయక ఆలయాన్ని నిర్మించారు.

మతం పేరిట ఎన్నో దాడులు, దారుణాలు ప్రపంచమంతటా జరుగుతున్న వేళ ఓ పెద్దాయన తన మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఏకంగా రూ.2 కోట్లు పెట్టి గణేశుడి ఆలయాన్ని నిర్మించాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం ఉడుపికి చెందిన 77 ఏళ్ల వ్యాపారి గాబ్రియెల్ నజరెత్ క్రైస్తవుడు. ఈ నేపథ్యంలో ఆయన శిర్వాలోని​ తన ఇంటి సమీపంలో సొంత ఖర్చుతో సిద్ధి వినాయక ఆలయాన్ని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆలయ నిర్మాణానికి ఆయన అక్షరాల రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. తన తల్లిదండ్రులు ఫాబియన్​ సెబాస్టియన్ నజరెత్​, సబీనా నజరెత్​ స్మారకంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు గాబ్రియెల్​ తెలిపారు.

ముంబయిలో దాదాపు 55 ఏళ్లు నివసించిన గాబ్రియెల్​.. నగరంలోని ప్రఖ్యాత సిద్ధివినాయక స్వామి ఆలయాన్ని తరచూ సందర్శించేవారు. సిద్ధివినాయక స్వామి వల్లనే తన జీవితం​లో ఎన్నో విజయాలు సాధించగలిగానని చెప్పుకొచ్చారు. తాను క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నా హిందూ మతం అంటే తనకు ఎంతో గౌరవమని గాబ్రియెల్ తెలిపారు. ఇక దశాబ్దం క్రితం ముంబయిను విడిచి తన స్వగ్రామంలో స్థిరపడ్డ గాబ్రియల్​.. అక్కడ సిద్ధి వినాయకుడి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా గాబ్రియెల్ ఇటీవల తన ఇంటి సమీపాన 20 సెంట్ల విస్తీర్ణంలో గుడిని కట్టించారు.