Punjab Assembly Election 2022:చైనాతో సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారనీ, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని విమర్శించారు.
Punjab Assembly Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ... మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
వ్యవసాయ చట్టాలపై బీజేపీ అనుసరిస్తున్న తీరును మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాల వల్ల.. దేశంలో అప్పులు పెరుగుతున్నాయని విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశ ప్రజలు విసిగిపోతున్నారనీ, ప్రస్తుతం కాంగ్రెస్ చేసిన అభివృద్ది పనులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన కారణంగా హోషియార్‌పూర్‌కు వెళ్లేందుకు తన హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించిందని సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన వాదనను ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ భద్రతా లోపంపై పంజాబ్ ముఖ్యమంత్రిని, పంజాబ్ రాష్ట్ర ప్రజల పరువు తీయాలని బీజేపీ ప్రయత్నించిందని మన్మోహన్ సింగ్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని ధనవంతులు.. మరింత ధనవంతులు అవుతున్నారు. పేదలు మరింత పేదలుగా మారుతున్నారని మన్మోహన్ సింగ్ విమర్శించారు.
వ్యవసాయ చట్టాలు, విదేశాంగ విధానంపై తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ.. ఈ సమస్య దేశానికి మాత్రమే పరిమితం కాదనీ, భారత సరిహద్దు దగ్గర చైనా చొరబాటు అంశాన్ని బీజేపీ ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రాజకీయ నాయకులకు కౌగిలింతలు ఇవ్వడం వల్లనో, ఆహ్వానం లేకుండా బిర్యానీలు తినడం వల్లనో సంబంధాలు మెరుగుపడవని బీజేపీ నేతలపై మండిపడ్డారు. బ్రిటిష్ వారు అనుసరించిన విభజించి పాలించు అనే విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుందని అన్నారు. మోడీ సర్కార్ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మాట్లాడటం చాలా సులభం, కానీ వాటిని ఆచరణలో పెట్టడం చాలా కష్టమని బీజేపీ ప్రభుత్వంపై మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు.
