ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లో ఒకటి.. అమెరికాను సైతం వణికించగల సత్తా ఉన్న దేశం. సైనిక, ఆర్ధిక, వాణిజ్యం ఇలా ఏది తీసుకున్నా ఎవ్వరికి అందని స్థాయిలో వృద్ధిరేటు. మరి అలాంటి దేశాన్ని నడిపించే నాయకుడికి ఏ రేంజ్‌లో భద్రత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆయనే చైనా అధ్యక్షుడు జి. జిన్‌పింగ్. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భారతదేశానికి వచ్చారు. దీంతో ఆయన భద్రత కోసం భారత ప్రభుత్వంతో పాటు చైనా ప్రత్యేక బృందాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి.

ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఆయన సూపర్‌కార్. హోంగ్కీగా పిలిచే దీనిని రష్యాకి చెందిన ఆటోమొబైల్ సంస్థ తయారు చేసింది. సుమారు 18 అడుగుల పొడవు, 6.5 అడుగుల వెడల్పు, 5 అడుగుల ఎత్తుతో 3,152 కిలోల బరువుంటుంది. కేవలం పది సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా ఈ కారును తయారుచేశారు.

రోల్స్ రాయిస్, బెంట్లీ, బెంజ్ వంటి విలాసవంతమైన కార్లలో ఉండే సదుపాయాలను తలదన్నే రీతిలో ఇందులో సౌకర్యాలను అమర్చారు. ఇందులో 402 హార్స్‌పవర్‌తో ఉండే వీ8 ఇంజిన్‌ ఉంటుంది.

ఒకవేళ కారులో పెట్రోల్ ఖాళీ అయితే ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్ మోడ్‌లోకి మారిపోయి గ్యాస్ ట్యాంక్ నుంచి ఇంధనం సరఫరా అవుతుంది. గుళ్ల వర్షం కురిసినా, బాంబులు పేల్చినా ఏ మాత్రం చెక్కుచెదరదు.

అత్యవసర పరిస్ధితుల్లో బీజింగ్‌లోని అధ్యక్ష కార్యాలయంతో నేరుగా కనెక్ట్ అయ్యే విధంగా కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది. కాగా.. జిన్‌పింగ్ రాక సందర్భంగా చెన్నై తీరంలో మూడు సబ్‌మెరైన్లను సిద్ధం చేశారు.

మహాబలిపురంలోని బుల్లెట్‌ప్రూఫ్ ఆడిటోరియంలో మోడీ, జిన్‌పింగ్ భేటీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. సముద్రతీరంలో ఏడంచల భద్రతను, 24 గంటల పాటు నిఘాను పెట్టారు.