Maoists: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల రహస్య సొరంగాలు బట్టబయలు.. వీడియో షేర్ చేసిన అధికారులు
ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల రహస్య సొరంగం ఒకటి బయటపడింది. 130 మీటర్ల పొడవుతో 10 అడుగుల లోతుతో ఒకరు సులువుగా ప్రయాణం చేసే విధంగా ఈ సొరంగాలు ఉన్నాయి.
Chhattisgarh: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు ఇన్నాళ్లు రహస్యంగా తలదాచుకోవడానికి ఉపయోగించుకున్న సొరంగం బయటపడింది. అది 130 మీటర్ల పొడవు ఉన్నది. ప్రతి ఆరు మీటర్లకు ఓపెన్‌గా ఆ సొరంగం ఉన్నది. సీనియర్ లీడర్లు ఇలాంటి బంకర్లలోనే ఉంటారని మావోయిస్టులపై అవగాహన ఉన్న రిటైర్డ్ అధికారులు చెబుతున్నారు.
భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. దంతేవాడలోని బైరాంగడ్ పోలీసు స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో అభుజ్‌మడ్ అడవుల్లోకి భద్రతా బలగాలు వెళ్లాయి. మావోయిస్టులతో ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు తిరిగి వస్తుండగా.. ఈ బంకర్‌ను గుర్తించారు. స్థానిక గిరిజన యువకులు కూడా భాగంగా ఉండే ఓ జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందం తొలుత ఈ టన్నెల్‌ను గుర్తించింది. ఈ సొరంగం పది అడుగుల లోతుతో ఉన్నది.
#WATCH | Chhattisgarh: Visuals from a tunnel dug by Naxalites to be used as a bunker, in Dantewada.
— ANI (@ANI) January 31, 2024
(Source: Dantewada Police) pic.twitter.com/04gRKCtWYl
ఈ రీజియన్‌లో మేం కనుగొన్న అతిపెద్ద బంకర్ ఇదే అనుకుంటా అంటూ దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. భద్రతా బలగాల కదలికల సమయంలో మావోయిస్టులు ఈ బంకర్‌లలో తలదాచుకుంటారని భావిస్తున్నామని వివరించారు. పోలీసు బలగాలనూ ట్రాప్ చేయడానికి, అంబుష్ కోసం కూడా ఈ సొరంగాలను ఉపయోగిస్తారని తెలిపారు.
యాంటీ నక్సల్ ఆపరేషన్స్‌లో స్పెషల్ డైరెక్టర్ జనరల్, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్కే విజ్ మాట్లాడుతూ.. ‘సీనియర్ మావోయిస్టుల కోసం ఇలాంటి బంకర్లు ఉపయోగిస్తుంటారు. ఆ బంకర్ గుండా నడుచుకుంటూ వెళ్లవచ్చు. ఈ బంకర్‌లోకి కాంతి పడటానికి ఓపెన్ చేసి ఉంచడాన్ని బట్టి చూస్తే అది సీనియర్ లీడర్ కోసమే అయి ఉంటుంది’ అని వివరించారు.