రెండు సంవత్సరాలుగా ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఆమె కూడా అతనితో స్నేహంగానే మెలిగింది. ఓ రోజు ధైర్యం చేసి తన మనసులో మాట చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. అంతే కాదు అతనితో మాట్లాడటం మానేసింది. అతనిని దూరంగా పెట్టేసి... సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. దీంతో తట్టుకోలేకపోయాడు. తన ప్రేమకు గుర్తుగా చివరగా ప్రియురాలికి బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. వెంటనే తన చేతిని కోసుకొని రక్తాన్ని బాటిల్ లో నింపి... తన ప్రియురాలికి ఇవ్వాల్సిందిగా స్నేహితులకు చెప్పాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నంగనల్లూర్ ప్రాంతానికి చెందిన  కుమరేస పాండియన్(36) కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. కాగా.. తమ సమీమ బంధువైన 30ఏళ్ల మహిళను అతను రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అతనితో స్నేహంగా మెలిగేది. ఇటీవల కుమరేస తన ప్రేమను ఆమెకు తెలియజేశాడు.

అయితే ఆమె అతని ప్రేమను నిరాకరించింది. కనీసం స్నేహం కూడా చేయనని తేల్చిచెప్పింది. అతనిని సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. అతనిని పూర్తిగా ఎవాయిడ్ చేసింది. దీంతో కుమరేస పాండియన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మంగళవారం  సాయంత్రం అతను తన మిత్రుడు ముత్తు ఇంటికి వెళ్లాడు.

తన మిత్రుడు ముత్తుతో కలిసి మద్యం సేవించాడు. మత్తు మద్యం సేవిస్తూ ఉండగా.. కుమరేస.. తాను తాగుతున్న ఓ మద్యం సీసాను పగలకొట్టాడు. దాంతో తన ఎడమ చేతి మణికట్టును కోసుకున్నాడు. రక్తం కారుతుంటే దానిని మరో సీసాలో నింపేశాడు. మత్తు ఆపేందుకు ప్రయత్నించినా.. మద్యం మత్తులో ఉండటంతో ఏమీ చేయలేకపోయాడు. ఆ మత్తులోనే ఈ విషయాన్ని మిగితా మిత్రులకు తెలియజేశాడు.

వారు అక్కడికి చేరుకునే సరికి కుమరేస తన రక్తంతో బాటిల్ ని నింపేశాడు. దానిని తన ప్రియురాలికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతనిని స్నేహితులు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే... చికిత్సకు అతను సహకరించలేదు. దీంతో బుధవారం తెల్లవారు జామున అతను మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తరలించారు.