ఛత్తీస్గడ్: దేశరాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అంతా తడుముకోకుండా చెప్పేది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అని. రాహుల్ గాంధీ పెళ్లిపై ఒకప్పుడు పెద్ద చర్చే జరిగింది కూడా. ఆమెతో పెళ్లి అయ్యింది ఈమెతో డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయినా రాహుల్ గాంధీ బ్రహ్మచర్యం వదల్లేదు. 

అయితే రాహుల్ గాంధీకి మాత్రం యువతుల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాను పెళ్లి చేసుకుంటానంటే కాదు తాను చేసుకుంటానంటూ ముందుకు వస్తున్నారు. తాజాగా చత్తీస్ఘడ్ రాష్ట్రం జాష్‌పూర్ జిల్లా దుదులా పట్టణానికి చెందిన తుల్వారాణి గుప్తా అనే కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త రాహుల్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చింది. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఆ మహిళ అక్కడి పార్టీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. 

అయితే కాంగ్రెస్ లో చేరడానికి గల కారణాలు ఏంటని సదరు మహిళను విలేకర్లు ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. 

అయితే గతంలో కూడా ఇదే తరహా సంఘటన యూపీలో జరిగింది. రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలని ఉందని ఓ దళిత యువతి తన మనసులోని మాట బయటపెట్టింది. దళితులకు రాహుల్ ఎంతో సాయం చేస్తున్నారని అందుకే ఆయన్ని పెళ్లాడాలనుకుంటున్నానని ఆ యువతి చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.