ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ ను (మసరత్ ఆలం వర్గం) నిషేధించిన కేంద్రం.. ఎందుకంటే ?
జమ్మూకాశ్మీర్ లో జాతి వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతూ, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తోందన్న కారణంతో ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్ (మసరత్ ఆలం వర్గం) (ఎంఎల్ జేకే-ఎంఏ)ను నిషేధిత సంస్థగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హో మంత్రి వెల్లడించారు.
ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ (మస్రత్ ఆలం వర్గం) ను చట్టవ్యతిరేక సంఘంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆ సంస్థను నిషేధించిదని ప్రకటించారు.
‘‘ముస్లిం లీగ్ జమ్మూ కశ్మీర్ (మసరత్ ఆలం వర్గం) లేదా ఎంఎల్జేకే-ఎంఏను యూఏపీఏ కింద 'చట్టవ్యతిరేక సంఘం'గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది’’ అని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా వెల్లడించారు.
ఈ సంస్థ, దాని సభ్యులు జమ్మూకాశ్మీర్ లో జాతి వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారని, జమ్మూకాశ్మీర్ లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రజలను రెచ్చగొడుతున్నారని అమిత్ షా పేర్కొన్నారు.
దేశ సమైక్యత, సార్వభౌమత్వం, సమగ్రతకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా వదిలిపెట్టబోమని, చట్టం పూర్తి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హోం మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ సందేశం గట్టిగా, స్పష్టంగా ఉందని ప్రకటించారు.