CBSE & Other Boards Exams: సీబీఎస్ఈ, పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు  ఫైనల్ పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై  సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇలాంటి పిటిషన్లు విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్న ధ‌ర్మాస‌నం.. వారిలో తప్పుడు ఆశలు కల్పిస్తున్నాయని చెబుతూ.. ఈ పిటిష‌న్ల‌కు కొట్టివేసింది.  

CBSE & Other Boards Exams: క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా విద్యావ్య‌వ‌స్థ‌లో పెద్ద ఎత్తున్న మార్పులు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అన్ని ఇప్పుడు ఆన్‌లైనే అనే విధంగా మారిపోయింది. అయితే, సీబీఎస్ఈ స‌హా 10, 12 త‌ర‌గ‌తుల బోర్డు ఎగ్జామ్స్ (CBSE & Other Boards Exams)ను ఆప్‌లైన్ లో నిర్వ‌హించ‌డానికి అధికార యంత్రాంగం సిద్ధ‌మ‌వుతోంది. మార్చి/ఏప్రిల్‌లల్లో వాటిని నిర్వహించాల్సి ఉండ‌గా.. దీనికి సంబంధించిన షెడ్యూల్ ల‌ను ప‌లు బోర్డులు ఇదివరకే విడుదల చేశాయి. అయితే, సీబీఎస్ఈ, పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. కరోనా వైరస్ మ‌హ‌మ్మారి ప్ర‌భావం దేశంలో ఇంకా కొన‌సాగుతున్నపరిస్థితుల మధ్య ఆఫ్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించడం వల్ల లక్షలాది మంది విద్యార్థులను.. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావితం చేసే అవ‌కాశ‌ముంద‌నీ, ఈ చ‌ర్య‌లు శ్రేయస్కరం కాదంటూ పిటిష‌న్లు పేర్కొన్నాయి.

ఇక ఈ పిటిష‌న్ల‌ను దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) విచార‌ణ‌కు స్వీక‌రించింది. బుధ‌వారం నాడు దీనిపై విచార‌ణ‌లు జ‌రిపింది. న్యాయ‌మూర్తులు జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌రిపింది. పిటీషన్ల తరఫున ప్రముఖ న్యాయ‌వాది ప్రశాంత్ పద్మనాభన్ తన వాదనలను వినిపించారు. వాద‌న‌లు విన్న త‌ర్వాత సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇలాంటి పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌ర‌ప‌డం స‌రైంది కాద‌ని పేర్కొంటూ.. ఈ పిటీషన్లన్నింటినీ కొట్టివేసింది. ఈ త‌ర‌హా పిటీషన్ల వల్ల కోట్లాదిమంది విద్యార్థులకు తప్పుడు సంకేతాలను పంపించినట్టవుతుందని పేర్కొంది. "ఈ పిటిషన్లు విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్న ధ‌ర్మాస‌నం.. వారిలో తప్పుడు ఆశలు కల్పిస్తున్నాయని చెబుతూ.. ఈ పిటిష‌న్ల‌కు కొట్టివేసింది". 

పిటిష‌న్లు పేర్కొన్న క‌రోనా ప‌రిస్థితుల‌ను కూడా సుప్రీంకోర్టు ప్ర‌త్యేక ధ‌ర్మాస‌నం ప్ర‌స్తావించింది. గ‌త సంవత్సరం తరహా పరిస్థితులు ఇఫ్పుడు లేవని బెంచ్ స్పష్టం చేసింది. పరీక్షలను నిర్వహించాలా? వద్దా? అనేది అధికారులకే వదిలి వేస్తున్నామని పేర్కొంది. "ఇది తప్పుడు ఆశలను మాత్రమే సృష్టిస్తుంది.. అలాగే,ప‌రీక్ష‌ల‌కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది గందరగోళాన్ని సృష్టిస్తుంది" అని న్యాయ‌మూర్తులు జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. "విద్యార్థులను వారి పనిని చేయనివ్వండి. అధికారులు వారి పనులు చేయనివ్వండి" అని ధర్మాసనం తెలిపింది. అధికారులు ఇదివరకే షెడ్యూల్‌ను రూపొందించారనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు జస్టిస్ ఖన్విల్కర్ పేర్కొన్నారు. ఇలాంటి పిటీషన్లను విచారించడం సహేతుకం కాదని తేల్చి చెప్పారు. కాగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వంటి కేంద్రీయ విద్యాసంస్థలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బోర్డ్ పరీక్షల (CBSE & Other Boards Exams)ను నిర్వహించడానికి సిద్ద‌మ‌వుతున్నాయి. ప‌లు బోర్డులు షెడ్యూల్ సైతం ప్ర‌క‌టించాయి.