రాంపూర్: తన రాజకీయ ప్రత్యర్థి, ఎస్పీ నేత ఆజం ఖాన్ పై సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద తీవ్రంగా విరుచుకుపడ్డారు. బిజెపి తరపున ఆమె ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఆజం ఖాన్ వల్ల ఎందరో మహిళలు కన్నీరు పెట్టుకున్నారని, ఆ శాపం తగిలిందని, దాంతో ఇప్పుడు ఆజం ఖాన్ కేసులను ఎదుర్కుంటున్నారని ఆమె అన్నారు. 

ఎన్నికల ర్యాలీల్లో ఆజం ఖాన్ ఉద్వేగానికి గురి కావడంపై ఆమె స్పందించారు. తనను మంచినటి అని ఆజం ఖాన్ అన్నారని, ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడని జయప్రద అన్నారు. బిజెపి తరఫున రాంపూర్ లో ఆమె ప్రచారం నిర్వహిస్తూ ఆజంఖాన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

ప్రతి ఎన్నికల ప్రచార సభలో ఆజం ఖాన్ ఏడుస్తున్నాడని, తనను మంచి నటిగా అభివర్ణిస్తూ వచ్చారని, ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడని, అతని వల్ల కన్నీరు పెట్టుకున్న మహిళల శాపం అతనికి తగిలిందని అన్నారు. 

ఆజంఖాన్ పేదల భూములను లాక్కున్నారని, అతన్ని అల్లా క్షమించబోడని జయప్రద అన్నారు. ఆజం ఖాన్ ను తాను సోదరుడిగా చూశానని, ఆయన తనను సోదరిలా చూశాడా, అలా చూస్తే తనను గౌరవించడం నేర్చుకోవాలని జయ ప్రద అన్నారు. 

తనపై భూ ఆక్రమణల కేసులు నమోదు కావడాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల ఆజం ఖాన్ ఎన్నికల ర్యాలీలో ఉద్వేగానికి గురయ్యారు. మీ కోసం పనిచేస్తుంటే తనను నేరస్థుడని అంటున్నారని ఆయన ఎన్నికల ప్రచార సభలో అన్నారు.  పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నందువల్లనే తనను కేసులతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

కోర్టు నిర్ణయం కోసం వేచి చూడాలని తాను ట్రిపుల్ తలాఖ్ పై, అయోధ్య రామ మందిర్ పై చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు ేచశారు. అంతకు మించి తానేమీ మాట్లాడలేదని, అయినా తనకు శిక్ష వేస్తున్నారని ఆయన అన్నారు. మంచి రాజకీయ నాయకుడిగా, మంచి వ్యక్తిగా తనను పరిగణించేవాళ్లు ఉన్నారని ఆయన చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క కిలో బరువు కూడా పెరగకపోగా 22 కిలోల బరువు తగ్గానని అన్నారు.