రెజ్లింగ్ తో సంబంధాలు తెంచుకున్నా.. డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ సస్పెన్సన్ పై బ్రిజ్ భూషణ్ సింగ్
Brij Bhushan Singh : తనకు ఇప్పుడు రెజ్లింగ్ తో ఎలాంటి సంబంధాలు లేవని డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ కొత్త ప్యానెల్ సస్పెన్షన్ ఎందుకు జరిగిందో తనకు తెలియదని చెప్పారు.
WFI New Panel Suspension : భారత రెజ్లింగ్ సమాఖ్య కు కొత్తగా ఎన్నికైన బోర్డును క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేయడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ఆదివారం ఆయన న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి వివాదాన్ని సృష్టించాలనుకోవడం లేదని అన్నారు. కానీ భారత రెజ్లింగ్ జరుగుతున్న తాజా పరిణామాలతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు.
‘‘రెజ్లర్ల కోసం 12 ఏళ్లు పనిచేశాను. నేను న్యాయం చేశానో లేదో కాలమే చెప్పాలి. రెజ్లింగ్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యాను. రెజ్లింగ్ తో సంబంధాలు తెంచుకున్నాను. ఇప్పుడు ప్రభుత్వంతో నిర్ణయాలు, చర్చలు ఫెడరేషన్ ఎన్నికైన వారే చేస్తారు’’ అని బ్రిజ్ భూషణ్ సింగ్ చెప్పారు. కాగా.. బ్రిజ్ భూషణ్ సింగ్ పలువురు యువ జూనియర్ రెజ్లర్లను వేధించారని ఆరోపిస్తూ రెజ్లర్లు ఈ ఏడాది ప్రారంభంలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
ఈ ఆందోళన దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్యకు జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ దూరంగా ఉన్నాయి. కానీ ఈ నెల 21వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఆయన సన్నిహితుడు సంజయ్ సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. దీనిపై రెజర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆదే రోజు సాయంత్రం రెజర్లు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో రెజ్లర్ సాక్షి మాలిక్ తీవ్ర భావోద్వేగానికి గురయయారు. కన్నీటి పర్యంతమవుతూ తాను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. అలాగే మరో రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా ఈ ఎన్నిక స్పందించారు. తాను పద్మ శ్రీ పురుస్కారాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు.
ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన సంస్థను మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. సంజయ్ సింగ్ అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన బోర్డు నియమ నిబంధనలను ఉల్లంఘించిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ఎన్నికైన బోర్డు కూడా మునుపటి ఆఫీస్ బేరర్ల నియంత్రణలో ఉందని మంత్రిత్వ శాఖ ఆరోపించింది. రెజ్లింగ్ అండర్ -15, అండర్ -20 నేషనల్స్ ఈ సంవత్సరం చివరిలోగా గోండా (యూపీ) లోని నందిని నగర్ లో జరుగుతాయని ప్రకటించిందని తెలిపింది. ఈ నేషనల్స్ లో పాల్గొనాల్సిన రెజ్లర్లకు తగిన నోటీసు ఇవ్వకుండానే డబ్ల్యూఎఫ్ ఐ రాజ్యాంగ నిబంధనలను పాటించకుండా ఈ తొందరపాటు ప్రకటన చేశారని క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.